ఆస‌క్తిక‌ర ఫ‌లితాల‌కు వేదిక‌గా నిలిచిన మ‌హారాష్ట్రలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మిత్ర‌ప‌క్షాల స‌ర్కారులో సీఎం కుర్చీ విషయంలో..ఆ పార్టీల మధ్య నెలకొన్న లొల్లికి తెరపడటంలేదు. చేరో సగం అంటే రెండున్నరేళ్ల‌ పాటు బీజేపీ, మరో రెండున్నరేళ్లు శివసేన ముఖ్యమంత్రి ఉండాలన్న ఫార్ములాపై ఇరుపార్టీల నేతల మధ్య రచ్చరంబోలా అవుతోంది. ఇరుపార్టీల మధ్య రాజీ మార్గం కుదిర్చేలా మంగళవారం జరగాల్సిన భేటీ రద్దయింది. ఇక బీజేపీ బెదిరింపులకు దిగుతోంది. మీ పార్టీకి చెందిన 45 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ మైండ్‌గేమ్‌ను బీజేపీ షురూ చేసింది. ఇదే స‌మ‌యంలో నేడు మ‌హారాష్ట్రలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, హోంమంత్రి అమిత్‌షా ప‌ర్య‌టించ‌నున్నారు.


సీఎం పదవిని చెరో రెండున్నరేళ్ల‌పాటు పంచుకునేలా లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బీజేపీ, శివసేన మధ్య 50-50 ఫార్ములాపై ఒప్పందం కుదిరిందని శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు మొదలుపెట్టడానికి ముందు ఈ ఒప్పందంపై రాత పూర్వక హామీ ఇవ్వాలని శివసేన డిమాండ్ చేస్తోంది. అయితే, దీనిపై బీజేపీ నేత‌,  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. తదుపరి ప్రభుత్వంలో ఐదేండ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తేల్చిచెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన సమయంలో (తదుపరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత) శివసేనకు రెండున్నరేళ్ల‌పాటు సీఎం పదవిని అప్పగిస్తామని తామెన్నడూ ఆ పార్టీకి హామీ ఇవ్వలేదని కుండబద్దలు కొట్టారు. ముంబైలోని తన అధికారిక నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఐదేళ్లు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే కొనసాగుతుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టంచేశారు. బీజేపీ లక్ష్యంగా తరచూ విమర్శలు గుప్పిస్తున్న శివసేన పత్రిక ‘సామ్నా’పై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. చర్చలను ‘దారి తప్పించడమే’ దాని పని అని విమర్శించారు. 


కాగా, ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్‌ను శివసేన వదులుకొని, డిప్యూటీ సీఎం పదవితో సర్దుకుపోవాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథావలే సూచించారు. మరోవైపు, అసెంబ్లీలో బీజేపీ బలాన్ని నిరూపించుకోలేని పక్షంలోనే ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై ఆలోచిస్తామని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నేత నవాబ్‌ మాలిక్‌ చెప్పారు. కాగా 50-50 సూత్రంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే అంతిమ నిర్ణయం తీసుకుంటారని బీజేపీ సీనియర్‌ నేత చంద్రకాంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో...అమిత్‌షా టూర్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: