సికింద్రాబాద్ బోయిన్ పల్లి మార్కెట్ వద్ద రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు మార్కెట్ యార్డ్ ను ముట్టడించటానికి ప్రయత్నాలు చేయగా పోలీసులు ముట్టడించటానికి ప్రయత్నించిన రైతులను అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ మార్కెట్ లో రైతులు, హమాలీల మధ్య తూకం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. హమాలీలు 80 కేజీల బరువు ఉన్న బస్తాలను లోడ్ అన్ లోడ్ చేయలేమని చెబుతున్నారు. 
 
హమాలీలు అలా చెప్పటంతో మార్కెట్ లో తూకం నిలిచిపోయింది. అధికారులు తగిన చర్యలు తీసుకోవటం లేదనే కారణంతో రైతులు మార్కెట్ యార్డ్ ముట్టడికి ప్రయత్నాలు చేశారు. రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలుస్తోంది. హమాలీలు 80 కేజీల బస్తాను మోయటం కుదరదని 80 కిలోల బస్తాలు చాలా బరువుగా ఉంటాయని గత కొద్దిరోజుల నుండి అన్ లోడ్ చేయటం లేదు. 
 
అన్ లోడ్ చేయకపోవటంతో వారం రోజుల నుండి ఈ మార్కెట్ లో వ్యాపారం దెబ్బ తింటోందని సమాచారం. హమాలీలు 80 కిలోల కూరగాయల బస్తాలను 50 కిలోలకు కుదించాలని డిమాండ్ చేస్తున్నారు. 50 కిలోల కూరగాయల బస్తాలను తీసుకొనివస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి తీవ్రంగా నష్టపోతున్నామని హమాలీ కూలీలకు కూడా భారీగా చెల్లిస్తే నష్టాలు పెరుతాయని రైతులు చెబుతున్నారు. 
 
ప్రభుత్వం, అధికారులు తమ సమస్యల గురించి పట్టించుకోకపోవటంతో భారీ సంఖ్యలో రైతులు ఈరోజు ఉదయం మార్కెట్ కు ధర్నా చేయటానికి వచ్చారు. హమాలీలు మాత్రం 80 కిలోల బస్తాలను అనుమతించవద్దని అధికారులను కోరుతున్నారు. రైతులను పోలీసులు అరెస్ట్ చేయటంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: