వైసిపి ఎంఎల్ఏ ఎన్నికపై తీవ్ర గందరగోళం మొదలైంది. రాజధాని ప్రాంతంలోని తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి ఎన్నికపై విచారణకు ఆదేశాలు జారీ అవ్వటం గమనార్హం. ఎస్సీ నియోజకవర్గమైన తాడికొండలో వైసిపి తరపున శ్రీదేవి గెలిచింది. అయితే ఆమె క్రిస్తియన్ అనే ఆరోపణలున్నాయి. క్రిస్తియన్ అంటే సహజంగా బిసి క్రిందకు వస్తారు.

 

ఇంత వివాదాస్పదరీతిలో   శ్రీదేవి ఎస్సీ నియోజకవర్గంలో ఎలా పోటీ చేశారో ఎవరికీ అర్ధం కావటం లేదు. అభ్యర్ధులు నామినేషన్ లో ఏమిచ్చినా వాటిని రూఢీ చేసుకోవాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారులదే. రిజర్వుడు నియోజకవర్గాల్లో పోటి చేసే అభ్యర్ధులు తమ రిజర్వేషన్ క్యాటగిరికి సంబంధించిన ఆధారాలను కూడా నామినేషన్లోనే అందచేయాలి.

 

మరి క్రిస్తియన్ సామాజికవర్గమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీదేవి ఎస్సీ నియోజకవర్గంలో పోటి చేసేటపుడు నామినేషన్లో ఎటువంటి ఆధారాలు అందించారో తెలీదు. ఎలక్షన్ ముందు చేతిలో  ఓ బైబిల్ తో కనిపించినట్లు ఆరోపణలు కూడా శ్రీదేవి పై ఉన్నాయి. అయితే తాను మాత్రం  ఎస్సీననే అంటోంది. తన సామాజికవర్గంపై వస్తున్న ఆరోపణలను ఎంఎల్ఏ కొట్టిపడేస్తున్నారు. అంతేకానీ తాను ఎస్సీనే అనేందుకు సాక్ష్యాలను మాత్రం శ్రీదేవి బహిరంగంగా ఎవరికీ చూపించలేదు.

 

 ఇదే విషయమై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్ధ శ్రీదేవి ఎన్నికపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదుకు ఆధారంగా శ్రీదేవి గతంలో చేసిన ప్రకటనలు, తాము సేకరించిన ఆధారాలను కూడా ఫోర్స్ అందించింది. ఆ ఫిర్యాదును పరిశీలించిన రాష్ట్రపతి అవసరమైన చర్యలు తీసుకోమంటూ చీఫ్ సెక్రటరీకి పంపారు.

 

రాష్ట్రపతి నుండి వచ్చిన ఆదేశాలు కాబట్టి ప్రధాన కార్యదర్శి  ఈ విషయమై విచారణ జరపక తప్పదు. అదే సమయంలో ఫోర్స్ కోర్టులో వేసిన పిటీషన్ కూడా విచారణకు రానుంది. కాబట్టి శ్రీదేవి సామాజికవర్గంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే విచారణ జరిపించేందుకే అవకాశముంది. మరి విచారణలో ఏం తేలుతుందో చూడాల్సిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: