మహారాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 21 వ తేదీన ఎన్నికలు జరిగాయి.  అక్టోబర్ 24 వ తేదీన ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.  ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు.  బీజేపీ.. శివసేన పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి.  సీట్లతో పాటుగా మంత్రి వర్గం కూడా 50-50 పంచుకోవాలని అమిత్ షా  సమక్షంలో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.  ఈ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో, శివసేన 54 స్థానాల్లో విజయం సాధించింది.  ఈ రెండు పార్టీలకు గతంలో కంటే సీట్లు తగ్గిన మాట వాస్తవమే. 


కానీ, శివసేన సపోర్ట్ లేకుండా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.  దీంతో శివసేన డిమాండ్ చేయడం మొదలుపెట్టింది.  ఎవరికైనా అవకాశం వస్తే ఊరుకుంటారా చెప్పండి.  ఇప్పుడు శివసేనకు అవకాశం వచ్చింది.  దానిని వదలకూడదు అనుకుంది. అందుకోసమే రెడీ అయ్యింది.  ముఖ్యమంత్రి కుర్చీని చెరో రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలని పట్టుబట్టింది.  అందుకు బీజేపీ ససేమిరా అనడంతో టెన్షన్ మొదలైంది.  


గత ఐదు రోజులుగా ఈ టెన్షన్ ఇలానే కొనసాగుతోంది.  అవసరమైతే కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన చెప్తున్నది.  శివసేన కూటమి నుంచి బయటకు వెళ్తామని బెదిరిస్తున్నా.. బీజేపీ మాత్రం లొంగడం లేదు.  ఏది ఏమైనా సరే... ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ప్రసక్తి లేదని అంటోంది.  దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.  ఇది ఎక్కడికి దారితీస్తుందో అని మహా ప్రజలు భయపడుతున్నారు.  


ఇక, శివసేన పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో బీజేపీ గురించి వ్యగ్యంగా కార్టూన్లు చిత్రీకరిస్తున్నారు.  కమలానికి బాణం ఎక్కుపెట్టిన శివసేన కార్టూన్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.  తమతో కలిసి వస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్, ఎన్సీపీలు చెప్తున్నాయి.  కాగా, ఈరోజు బీజేపీ చీఫ్ అమిత్ షా ముంబై వెళ్తున్న సంగతి తెలిసిందే.  శివసేనతో చర్చలు జరిపిన తరువాత ప్రభుత్వ  ఏర్పాటు విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: