కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు మృతి చెందారు. తుముకూరు జిల్లా కొరటెగెరిలోని తొట్టి అగ్రహారం గ్రామం దగ్గర ప్రైవేట్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందగా కొంతమంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా ఈ ప్రదేశంలో ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. 
 
ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణికులతో పాటు విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే రోడ్డులో గతంలో ఎన్నో ప్రమాదాలు జరగటంతో అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు. అధికారులు చర్యలు తీసుకున్నా ఈ రోడ్డులో నిత్యం ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రైవేట్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు చెబుతున్నారు. 
 
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం గురించి విచారణ జరుపుతున్నారు. చనిపోయిన వారిలో నలుగురు కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులని సమాచారం. కర్ణాటక రాష్ట్రంలో ఒక రోజుకు పదికి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదాలను తగ్గించటానికి ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. తుముకూరు నుండి మంగళూరు వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులు ప్రమాదానికి గురైన బస్సులో ఉన్నారు. 
 
30 మంది ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణించారని ముందువరుసలో కూర్చున్న ప్రయాణికులు మాత్రమే ప్రమాదానికి గురయ్యారని సమాచారం. ప్రయాణికులు కొందరు తీవ్ర గాయాలపాలయినప్పటికీ వారి ప్రాణాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. ఈ బస్సు నడిపిన డ్రైవర్ కు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయని సమాచారం. బస్సు డ్రైవర్ వేగంగా నడపటం వలనే ప్రమాదం జరిగిందని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. హైవే రోడ్డు మార్గాల్లో ప్రైవేట్ బస్సులు అతివేగంతో వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: