మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలున్నాయిగా. ఈ ప్రభావం ఒకటి రెండు రోజులు ఉండేలా ఉంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రేదేశ్ ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాల్సి ఉంది. వాతావరణ శాఖ కధనం ప్రకారం..ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో బలపడి అరేబియా సముద్రం పరిసరాల్లో అల్పపీడనం తదనంతరం వాయుగండంగా మారే అవకాశం వుందని పేర్కొంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు, ఒకటి, రెండుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది.



కాగా ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒంగోలులో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.  ఇదిలా ఉండగా సోమశిల జలాశయం నీటిమట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుత నీటి మట్టం 77.345 టిఎంసిలకు చేరుకుంది. రిజర్వాయరు పూర్తి సామర్థ్యం 78టిఎంసిలు. ఇన్ ఫ్లో 28వేల 944 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో 12వేల క్యూసెక్కులకు చేరుకుంది. బుధవారం సాయంత్రం లోపు గేట్లు ఎత్తి వేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇక తమినాడు విషయానికి వస్తే.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.




మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జనం వణుకుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని కాంచీపురం, ఆర్కేనగర్‌, తిరుత్తణి, తూత్తుకుడి, తిరునల్వేలి, తంజావూరు, తిరువారూరు, శివగంగై జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో పక్క కొమరిన్‌, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం వర్షబీభత్సం అధికంగా ఉన్న మధురై, రామనాథపురం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ప్రభుత్వం కోరింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: