తెలంగాణ స‌ర్కారులో ఆర్టీసీని విలీనం చేయాల‌నే ప్ర‌ధాన‌మైన డిమాండ్‌తో  జ‌రుగుతున్న స‌క‌ల జ‌నుల‌ జ‌న‌భేరీ స‌భ స‌క్సెస్ అయింది. ఈ స‌భ స‌క్సెస్‌తో తెలంగాణ స‌ర్కారు కు వ‌ణుకు ప్రారంభ‌మైంది. స‌భ‌కు హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. స‌భ‌కు అడుగ‌డుగునా ప్ర‌భుత్వం, పోలీసులు అడ్డంకులు క‌లిగించినా నిర్భందాల‌ను ఖాత‌రు చేయ‌కుండా ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ స‌భ్యులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. స‌రూర్ న‌గ‌ర్ స్టేడియం ఉద్యోగుల‌తో కిక్కిరిసిపోయింది. దీంతో స‌భ స‌క్సెస్‌తో స‌మ్మెకు మ‌రింత ఊపు రానుండ‌గా, స‌ర్కారుకు ఏమీ చేయాలో దిక్కు తోచ‌ని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 


ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రభుత్వం తేల్చి చెప్పింది.  26 డిమాండ్లను పరిష్కరించాలని కోరినా అందులో కేవలం రెండు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని, అంతకు మించి నెరవేర్చిడం ప్రభుత్వానికి కష్టం అవుతుందని ప్రభుత్వం చెప్తోంది.  ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో బుధ‌వారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సరూర్ నగర్ స్టేడియంలో సకలజనుల సమరభేరి సభను ఆర్టీసీ జెఏసి ఏర్పాటు చేసింది. ఈ సభకు భారీ ఎత్తున కార్మికులు, మద్దతు దారులు తరలివచ్చారు. ఈ స‌భ‌కు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే స‌భ‌కు అటంకాలు క‌లిగించేందుకు స‌ర్కారు అనేక అడ్డంకులు క‌ల్పిస్తుంద‌ని ఆర్టీసీ జెఏసీ నేత‌లు ఆరోపించారు. 


స‌భ జ‌రుగకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని కార్మిక సంఘం నేత‌లు ఆందోళ‌న చెందారు. కానీ అటు ప్ర‌భుత్వ నిర్భందాన్ని చేధించుకుని, ఇటు కార్మిక సంఘాల జెఏసీ నేత‌ల పిలుపుకు మ‌ద్ద‌తుగా ఆర్టీసీ కార్మికులు క‌దం తొక్కారు. స్టేడియం అంతా జ‌నంతో కిక్కిరిసిపోయింది. రోడ్డు మీద కూడా కార్మికులు, మ‌ద్ద‌తుదారులు నిల‌బ‌డ‌టంతో స‌భ భారీగా స‌క్సెస్ అయిన‌ట్లే లెక్క‌. ఈ స‌భ విజ‌య‌వంతం కావ‌డంతో సర్కారు గుండెల్లో రైళ్ళు  ప‌రుగెడుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు స‌మ్మె ప్ర‌క‌టించ‌గానే చ‌ర్చ‌లు జ‌రిపి స‌మ‌స్య‌ను ఆదిలోనే ప‌రిష్క‌రిస్తే సీఎంకేసీర్ పెద్ద‌రికానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయోది. 


ఇప్పుడు చ‌ర్చ‌లు కాస్తా విఫ‌లం కావ‌డం, స‌మ్మెకే కార్మిక సంఘాలు జై అన‌డం, కేసీఆర్ మొండిప‌ట్టు ప‌ట్ట‌డం, హైకోర్టు కేసీఆర్ స‌ర్కారుకు మొట్టికాయ‌లు వేయ‌డం, ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం, హైకోర్టు స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో కేసీఆర్‌కు అడుగ‌డుగునా అవ‌మానాలే మిగిలుతున్నాయి. ఇప్పుడు స‌భ స‌క్సెస్ కావ‌డంతో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఇక కేసీఆర్ త‌న పెద్ద‌రికాన్ని కాపాడుకునేందుకు ఆర్టీసీ సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి వారి న్యాయ‌మైన డిమాండ్ల‌ను తీర్చ‌డం త‌ప్ప మ‌రో గ‌త్యంత‌రం లేని స్థితికి నెట్ట‌బ‌డ్డారు. ఆర్టీసీ జెఏసీ నేత‌లు స‌భ‌ను విజ‌య‌వంతం గా నిర్వ‌హించి కేసీఆర్ స‌ర్కారుకు భారీ షాక్‌ను ఇచ్చిన‌ట్లే. ఈ షాక్ నుంచి కేసీఆర్ తేరుకుని న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే మొద‌టికే మోసం రాక త‌ప్ప‌దు మ‌రి. 


మరింత సమాచారం తెలుసుకోండి: