కంచె చేను మేసినట్లు ఏసీబీ అధికారుల పనితీరు ఉందన్నారు డిప్యూటీ సీఎం.  అవినీతి నిరోధించాల్సిన శాఖలో కొందరు అధికారులు దోపిడీ దొంగల్లా తయారయ్యారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ఫైర్ అయ్యారు.  అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారని.. అలాంటి అధికారులను చూస్తుంటే అసహ్యం వేస్తోందని అన్నారు. ఈ వ్యవహారంపై హోంమంత్రికి ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు.

  ఆ అధికారులపై విచారణ కూడా అవసరం లేదు క్లియర్‌గా ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు.తప్పు చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాలన్న ఆయన.. విశాఖ రేంజ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని చెప్పారు.  విశాఖ మధురవాడ రిజిస్టార్ కార్యాలయంలో సబ్‌ రిజిస్టార్‌ను ఇరికించబోయి.. ఏసీబీ అధికారులే ఆ వలలో చిక్కుకోవటం .. ఆ వివాదం తన వద్దకు రావటంతో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. 

 ‘విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీ, సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లు దారి దోపిడీ దొంగలకంటే దారుణంగా ఉన్నారు. అవినీతిని అరికట్టవలిసిన వాళ్లు దారుణాలు చేస్తుంటే మరి న్యాయం ఎవరు చేయగలరు ? వెంటనే వాళ్లను సస్పెండ్ చేయడమే కాకుండా.. సామాన్యులు తప్పుచేస్తే క్రిమినల్ కేసులు ఎలా ఫైల్ చేస్తున్నారో.. వీళ్లపై కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేసి చర్యలు తీసుకోవాలని ఏసీబీ డీజీతో మాట్లాడానని ఏం చర్యలు తీసుకుంటారో చూద్దామని సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ నెల 9న మధురవాడ సబ్‌ రిజి స్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లింది ఏసీబీ బృందం.ఆ సమయంలో పర్మిషన్‌పై ఇంటికి వెళ్లిపోతున్న సబ్‌ రిజిస్ట్రార్‌ టి.తారకేష్‌ను ఏసీబీ సీఐ గఫూర్‌ ఆపి.. కార్యాలయంలో కూర్చోబెట్టారు.


అనంతరం ఏసీబీ డీఎస్పీ రంగరాజు అక్కడకు చేరుకుని బయట గేటును మూయించివేసి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అయితే, ఎక్కడా డబ్బు దొరకలేదు. ఆ తర్వాత సీఐ గఫూర్‌ బయటకు వెళ్లి  రూ.61 వేల 500 నగదును తీసుకొచ్చి అక్కడే దొరికినట్లు కేసు పెట్టే ప్రయత్నం చేశారు. ఇదంతా సీసీ కేమెరాల్లో రికార్డు అయింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు మొత్తం వీడియోలను డిప్యూటీ సీఎం బోస్ ముందుంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: