జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  ఆశ‌ను బీజేపీ ఆదిలోనే నీరుగార్చింది. అంద‌రినీ క‌లుపుకొని ముందుకు సాగాల‌ని ప‌వ‌న్ భావిస్తే...తాము క‌లిసి వ‌చ్చేది లేద‌ని బీజేపీ తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని భవన  నిర్మాణ కార్మికుల కోరిక మేరకు ఇసుక సమస్య పరిష్కారంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తాను ప్ర‌య‌త్నిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలియ‌జేయ‌గా....తాము క‌లిసి వ‌చ్చే అవ‌స‌రం, అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేసింది. 


నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో జనసేన అధ్య‌క్షుడు లాంగ్ మార్చ్ తలపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యమై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అన్ని పార్టీల అగ్రనాయకులతో ఈ రోజు ఫోన్లో మాట్లాడారని జ‌న‌సేన తెలిపింది.తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో మాట్లాడిన సంద‌ర్భంగా...తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె కోసం అక్కడి రాజకీయపక్షాలు ఎటువంటి స్ఫూర్తి చూపుతున్నాయో ఇసుక సమస్య పరిష్కారానికి, లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మళ్ళీ ఉపాధి లభించేలా సమైక్యంగా అన్ని రాజకీయ పక్షాలు ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ కోరారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా మాట్లాడారని జ‌న‌సేన తెలిపింది.  తొలుత ఇదే సమస్యపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడినట్లు వెల్ల‌డించింది.


అయితే, ఏపీ బీజేపీ ఉపాధ్య‌క్షుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి జ‌న‌సేన‌పై ఘాటు స్పందించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పవన్ సభలో పాల్గోనాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేశారు. ``ఇసుక సమస్యపై మొదటి నుండి బీజేపీ పోరాడుతోంది. ముఖ్యమంత్రికి మొదట లేఖ రాసింది బీజేపీనే. ఇసుక సమస్యపై గవర్నర్‌ను కలిసి బీజేపీ రిప్రజెంటేషన్ ఇచ్చింది. భవన నిర్మాణ కార్మికుల కొరకు భిక్షాటన కార్యక్రమం కూడా బీజేపీ  చేసింది. సమస్యకి సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు సంఘీభావం కాదు. బీజేపీ ఆధ్వర్యంలో నవంబర్ 4న‌ విజయవాడలో కన్నా అధ్యక్షతన పెద్దఎత్తున మరోసారి ఆందోళ‌న చేపడతాము`` అని తేల్చిచెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: