రెండు పార్టీలు మిత్ర‌పక్షాలే...కానీ ఓ పార్టీ అంటే మ‌రో పార్టీకి ప‌డ‌దు... ఎవ‌రికి వారే య‌మునా తీరే. ఇదంతా మహారాష్ట్రలోని బీజేపీ-శివ‌సేన దోస్తీ గురించి.  శివసేనకు రెండున్నరేళ్ల‌పాటు సీఎం పదవిని అప్పగిస్తామని తామెన్నడూ హామీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కుండబద్దలు కొట్టారు. తదుపరి ప్రభుత్వంలో ఐదేండ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తేల్చిచెప్పారు. అంతేకాకుండా, బుద‌వారం బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎన్నికయ్యారు. దీంతో శివ‌సేన వ్యూహంపై ఆస‌క్తి నెల‌కొంది. 


మ‌రాఠాల గ‌డ్డ‌పై ప్రభుత్వ ఏర్పాటుపై చిక్కుముడి మరింత జఠిలంగా మారుతోంది. సీఎం పీఠంపై బీజేపీ, శివసేన మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో  సీఎం పదవిని చెరో రెండున్నరేండ్లపాటు పంచుకునేలా  బీజేపీ, శివసేన మధ్య 50-50 ఫార్ములాపై ఒప్పందం కుదిరిందని శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు మొదలుపెట్టడానికి ముందు ఈ ఒప్పందంపై రాత పూర్వక హామీ ఇవ్వాలని శివసేన డిమాండ్‌ చేస్తున్నది. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన సమయంలో (తదుపరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత) శివసేనకు రెండున్నరేండ్లపాటు సీఎం పదవిని అప్పగిస్తామని తామెన్నడూ ఆ పార్టీకి హామీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్ప‌ష్టం చేశారు. తదుపరి ప్రభుత్వంలో ఐదేండ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తేల్చిచెప్పారు. అంతేకాకుండా, ముంబయిలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఫఢ్నవీస్‌ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండోసారి బీజేఎల్పీ నేతగా ఎన్నికైన ఫఢ్నవీస్‌,  బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏలాంటి అనుమానాలు లేవన్న ఆయన, ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. 


ఇదిలాఉండ‌గా, ముఖ్యమంత్రి పదవి విషయంలో శివసేనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని సీఎం ఫడ్నవీస్‌ ప్రకటించిన కొన్ని గంటలకే శివసేన తీవ్రస్థాయిలో స్పందించింది. తదుపరి ప్రభుత్వ ఏ ర్పాటుపై రెండు పార్టీల మధ్య జరుగాల్సిన చ ర్చలను శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే రద్దు చేశారు. మంగళవారం సాయంత్రం ఈ చర్చలు జరుగాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, శివసేన మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. మరోవైపు, 50-50 ఫార్ములాపై సీఎంకు కౌంటర్‌ ఇస్తూ శివసేన ఒక వీడియో క్లిప్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ‘మళ్లీ మేం అధికారంలోకి వస్తే, పదవులు, బాధ్యతలు సమానంగా పంచుకోవాలని నిర్ణయించాం’ అని ఫిబ్రవరి 28న ఫడ్నవీస్‌ మీడియాతో మాట్లాడుతున్న ఆ వీడియోను ఠాక్రే సన్నిహితుడు హర్షల్‌ ప్రధాన్‌ విడుదల చేశారు. ‘హామీని కాస్త గుర్తుతెచ్చుకోండి’ అంటూ దానికి క్యాప్షన్‌ ఇచ్చారు. మ‌రోవైపు, శివసేన శాసనసభాపక్ష సమావేశంలో రేపు ముంబయిలో జరుగనుంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా?వద్దా? అన్నదానిపై శివసేన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ఇదే స‌మ‌యంలో బీజేపీకి సైతం కౌంట‌ర్లు ఇస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: