ఆర్టీసీ కార్మికుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు ఏర్పాటు చేసిన సకల జనుల భేరి సభ ప్రాంగణం లోనే ఒక డ్రైవర్ కు గుండెపోటు రావడం తో తోటి కార్మికులు అతన్ని   ఆసుపత్రి తరలించగా , చికిత్స పొందుతూ మృతి చెందాడు . ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని కోరుతూ  గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న  విషయం తెల్సిందే . సమ్మె చేస్తున్న దాదాపు 48  వేల మంది కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది . దీనితో  పలువురు కార్మికులు తీవ్ర మానసిక  ఒత్తిడికి గురయి గుండెపోటు తో మృతి చెందగా , మరికొంతమంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడడ్డారు .


 ఖమ్మం డిపో కు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోగా , తాజాగా అదే జిల్లా కు చెందిన మరో కండక్టర్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది .     ఈ నేపధ్యం లో సరూర్ నగర్ స్టేడియం ఆవరణ లో  కార్మికుల్లో మానసిక స్థయిర్యాన్ని నింపేందుకు నిర్వహించిన బహిరంగ సభ ప్రాంగణం లోనే కరీంనగర్ -2  డిపో కు చెందిన డ్రైవర్  నంగునూరు బాబు, వక్తల ప్రసంగాలు వింటూ గుండెపోటు కు గురయి , ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందడం కార్మికులను కలిచి వేసింది .


 సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి నంగునూరు బాబు తీవ్రంగా కలత చెందాడని , ఆ ఒత్తిడితోనే గుండెపోటు వచ్చి మృతి చెందాడని తోటి కార్మికులు చెబుతున్నారు . బాబు మృతి పట్ల కార్మిక జెఎసి నేతలు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు . బాబు మృతికి నిరసనగా గురువారం కరీంనగర్ జిల్లా బంద్ కు కార్మిక జెఎసి నేతలు పిలుపునిచ్చారు .  


మరింత సమాచారం తెలుసుకోండి: