మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త కొత్త డైలాగులతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఆయన జగన్ పై రోజూ కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇక ఇప్పుడు మరో కొత్త అస్త్రం తీశారు. అదే సంఘ బహిష్కరణ. ముఖ్యమంత్రి జగన్‌ తప్పుడు పనులు కొనసాగిస్తే శాశ్వతంగా సంఘ బాహీష్కరణకు గురయ్యే పరిస్థితి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు.


అంతే కాదు.. జగన్ తన మంత్రులను అదుపులో పెట్టుకోవాలని.. హెచ్చరిస్తున్నారు. ప్రైవేటు కేసులు వేసి పోలీసులనూ బోనులో నిలుచోబెడుతామంటున్నారు. ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. దళితులతో ఓట్లు వేయించుకున్న జగన్ వారినే మోసం చేస్తున్నారని అంటున్నారు. వైసీపీ నేతలు తప్పుడు కేసులు నమోదు చేయించారంటూ సదరు బాధితులతో చంద్రబాబు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో సమావేశమయ్యారు. జగన్ తన మంత్రులను అదుపులో పెట్టుకోవాలని కూడా వార్నింగ్ ఇచ్చారు.


పేదలపై పెత్తనం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు చట్టపరంగా వెళ్ళకుంటే వారికి శిక్ష పడేవరకు పోరాడతామన్నారు. డీజిపికి ఐపిఎస్‌ డిగ్రీ ఇచ్చింది తప్పుడు కేసులు బనాయించడానికి కాదని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ మారతారా లేదా అంటూ తనను చిత్రహింసలకు గురిచేసారని జయలక్ష్మి అనే ఆశా వర్కర్ సమావేశంలో చంద్రబాబుకు తెలిపింది.


ఎస్సీ మహిళ అయిన తనను ఉద్యోగానికి రాజీనామా చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని చెప్పింది. మంత్రి పేర్ని నాని ఇబ్బందులకు గురిచేయడం వల్లే తాను ఆత్మహత్యయత్నం చేశానని ఆమె ఆరోపించింది. ఇక ఇదే సమావేశంలో పాల్గొన్న నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వైసీపీ కక్షసాధింపు చర్యలు మితిమీరాయని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులందరూ ధైర్యంగా ఉండాలన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరపున ప్రయివేటు కేసు వేసి మంత్రిని బాధ్యుల్ని చేస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: