ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినా సదరు వ్యక్తులు, సంస్థల పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా విభాగాల కార్యదర్శులకు అధికారాలు కల్పించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


పరువు నష్టం కలిగించేలా నిరాధారమైన, దురుద్దేశపూర్వక వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా సదరు పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలతో పాటు న్యాయపరంగా కేసులు దాఖలు చేసేందుకు అధికారాలను దఖలు పరుస్తున్నట్టు సమాచార పౌరసంబంధాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రజలకు సరైన సమాచారం వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్తర్వులు వెలువరించినట్టు సమాచార పౌరసంబంధాల శాఖ స్పష్టం చేసింది.


సంబంధిత శాఖల కార్యదర్శులు దురుద్దేశపూర్వక, నిరాధారమైన వార్తలకు రిజాయిండర్లను జారీ చేయటంతో పాటు ఫిర్యాదు చేసేందుకూ అధికారాలు కల్పిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సంప్రదించి వారి ద్వారా కేసులు నమోదు చేసేందుకు అధికారం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.


అయితే ఈ విషయం కొత్తదేమీ కాదు.. గత మంత్రివర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అది జీవో రూపంలో వచ్చింది. తనను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్న ఎల్లో మీడియాను కట్టడి చేసేందుకే జగన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. అంతెందుకు.. ప్రమాణ స్వీకారం రోజే తనకు వ్యతిరేకంగా ఎల్లో మీడియా వార్తలు రాస్తుందని ప్రకటించేశారు. అందుకు తగ్గట్టు ఎల్లో మీడియా కూడా ఆధారాలు లేకపోయినా జగన్ సర్కారుపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది.


ఎల్లో మీడియాను కట్టడి చేసే లక్ష్యంతో తీసుకొచ్చినా ఇలాంటి జీవోలు పత్రికాస్వేచ్ఛను హరించే ప్రమాదం ఉంది. దీన్ని కొందరు అధికారులు దుర్వినయోగం చేసే అవకాశమూ ఉంది. నిన్నమొన్నటి వరకూ పత్రికా స్వేచ్ఛపై గళమెత్తి.. ప్రస్తుతం జగన్ సర్కారులో సలహాదారులుగా.. వివిధ పదవుల్లో ఉన్న జర్నలిస్టులు ఈ జీవోపై ఎలా స్పందిస్తారో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: