వైఎస్ జగన్.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నట్టు కనిపిస్తాడు.. ప్రత్యేకించి సంక్షేమ పథకాల విషయంలో ఈ ముద్ర కనిపిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో ఆయన తండ్రిని మించి సాహసాలు చేస్తుంటారు. ముక్కుసూటిగా వ్యవహారిస్తుంటారు. కఠినంగా ఉంటారు. ఇప్పుడు మీడియాను కట్టడి చేసే జీవో విషయంలో ఈ ధోరణే కనిపిస్తుంది.


జగన్ సర్కారు పత్రికలు, ఛానళ్లు, సోషల్ మీడియాను కట్టడి చేసేలా కొత్త జీవో తెచ్చింది. దీని ప్రకారం.. నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినా సదరు వ్యక్తులు, సంస్థలపై అధికారులు కేసులు పెట్టొచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


అయితే ఇది కొత్త జీవో కాదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ ఇలాంటి జీవో వచ్చింది. అప్పట్లో పత్రికలు ఈ విషయంపై గోల గోల చేశాయి. వై.ఎస్. ను నిలదీశాయి. అయితే మీడియా ఒత్తిడికి తలొగ్గారో.. లేక ఎందుకీ తలనొప్పి అనుకున్నారో తెలియదు కానీ వైఎస్ ఆ జీవోను అమలు చేయలేదు. కానీ ఇప్పుడు జగన్ మాత్రం పాత జీవోను బయటకు తీశారు. దానికి మరింత పదును పెట్టారు.


పరువు నష్టం కలిగించేలా నిరాధారమైన, దురుద్దేశపూర్వక వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా సదరు పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలతో పాటు న్యాయపరంగా కేసులు దాఖలు చేసేందుకు అధికారాలను దఖలు పరిచారు. ప్రజలకు సరైన సమాచారం వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్తర్వులు వెలువరించినట్టు సమాచార పౌరసంబంధాల శాఖ స్పష్టం చేసింది.


మరి ఈ జీవోపై పత్రికలు, ఛానళ్లు, సోషల్ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎవరు ఎలా స్పందించినా జగన్ వెనక్కు తగ్గే అవకాశాలు తక్కువ. అయితే జీవో తీసుకురావడం ఒక ఎత్తు.. దాన్ని అమలు చేయడం ఇంకో ఎత్తు. మరి జగన్ ఎంతవరకూ ఈ జీవోను అమలు చేస్తారో కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: