అక్టోబ‌ర్ 31, 2019...భార‌త‌దేశ చ‌రిత్ర‌లో మ‌రో ముఖ్య‌మైన తేదీగా నిల‌వ‌నుంది. దేశంలో కొత్త అధ్య‌య‌నానికి నాంది ప‌ల‌క‌నుంది. ఎందుకంటారా.....ఇప్పటివరకు రాష్ట్రంగా ఉన్న జమ్ముకశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిపోవడమే దీనికి కారణం. జ‌మ్ముకశ్మీర్‌ రాష్ర్టాన్ని విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆగస్టు 9న జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. అక్టోబర్‌ 30 అర్ధరాత్రి నుంచి మన దేశంలోని రాష్ర్టాల సంఖ్యలో ఒకటి తగ్గిపోవ‌డ‌మే కాకుండా...అదే సమయంలో కేంద్ర పాలిత ప్రాంతాలు రెండు కొత్తగా ఆవిర్భవించాయి. 


కొత్త పార్లమెంట్‌ తొలి లోక్‌సభ సమావేశాలలోనే ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌ను విభజిస్తున్నట్టు ప్రకటించింది. ఆ నిర్ణ‌యంతో  దీంతో దేశంలో రాష్ర్టాల సంఖ్య 28కి తగ్గగా, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య ఏడుకు పెరిగింది. జమ్ముకశ్మీర్‌కు తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గుజరాత్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి జీసీ ముర్ము బాధ్యతలు చేపట్టనున్నారు. అదే సమయంలో మరో ఐఏఎస్‌ అధికారి రాధాకృష్ణ మాథుర్‌ లఢక్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతారు. లడఖ్‌కు శాసనసభ ఉండదు. ఆ ప్రాంతంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా కేంద్ర హోం శాఖ ప్రత్యక్షంగా పరిపాలన సాగిస్తుంది. జమ్ముకశ్మీర్‌కు శాసనసభ ఉంటుంది. కానీ ఢిల్లీ తరహాలో ఇక్కడ పాలన సాగుతుంది. అయితే ఇక్కడ పాలనా విధానాలను నిర్దేశించే జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ఇంకా నోటిఫై కాలేదు. జాతీయ ఐక్యతా దినోత్సవం రోజునే రెండుకొత్త కేంద్ర పాలిత ప్రాంతాలు ఆవిర్భవించడం విశేషం. దేశ తొలి హోం మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతిని ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.


ఇదిలాఉండ‌గా, నాట‌కీయ పక్కీలో విభ‌జ‌న జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. విభ‌జ‌న స‌మ‌యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులందరినీ నిర్బంధించింది. రాష్ర్టాన్ని విభజించిన తరువాత మూడు రోజులకు ప్రధాని మోదీ టెలివిజన్‌ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, తమ నిర్ణయం గురించి జమ్ముకశ్మీర్‌ ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌ ప్రజలకు అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. కాగా, ఈ నిర్ణ‌యం స‌మ‌యంలో....సమాచార వ్యవస్థను పూర్తిగా నిలిపివేసింది, పలు నిషేధాజ్ఞలు విధించింది. ఆ తరువాత రెండున్నర నెలలకు ఆ ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ కశ్మీర్‌ లోయలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతున్నది. ఇంటర్నెట్‌ను పునరుద్ధరించలేదు. ప్రీపెయిడ్‌ మొబైల్‌ ఫోన్లు పనిచేయడం లేదు. మొత్తంగా మూడు నెలల కాలంలో చెదురుమదురు ఘటనలు మినహా జమ్ముకశ్మీర్‌ అంతటా ప్రశాంత వాతావరణం ఏర్పడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: