కాంగ్రెస్‌ను న‌డిపించే నాయ‌కుడ‌ని పార్టీ నేత‌లు కొండంత ఆశ‌లు పెట్టుకుంటున్న రాహుల్ గాంధీ పార్టీ నేత‌ల‌కు ఊహించ‌ని షాకులు ఇస్తున్నారు. పార్టీ ఓ లైన్‌లో ముందుకు సాగుతుంటే...రాహుల్ ఇంకో డైరెక్ష‌న్‌లో క‌దులుతున్నార‌ని అంటున్నారు. వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం నుంచి ఉద్యమబాట పట్టాలని నిర్ణయించింది. కానీ, ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ మాత్రం ఈ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ధ్యానముద్రలో ఉండనున్నారు. దీంతో తమ పార్టీ ఆచ‌ర‌ణ‌....నాయ‌కుడి తీరు లెక్కేంట‌ని నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. 


కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నవంబర్‌ 5 నుంచి 15వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, పెరుగుతున్న నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం తదితరాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నవంబర్‌ 1 నుంచి 8వ తేదీ మధ్య దాదాపు 35 నగరాల్లో పార్టీ సీనియర్‌ నాయకులు మీడియాతో మాట్లాడనున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఈ మేర‌కు రాష్ట్రాల వారీగా ఏర్పాట్లు సైతం పూర్త‌య్యాయి. ఈ స‌మ‌యంలో రాహుల్ గాంధీ ధ్యానం చేసేందుకు విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో రాహుల్ తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


మ‌రోవైపు ధ్యానం కోసం రాహుల్‌ విదేశీ పర్యటనకు వెళ్లడంపై బీజేపీ మండిపడుతున్నది. ‘భారత్‌.. ధ్యానానికి వారసత్వ కేంద్రంగా ఉన్నది. కానీ, రాహుల్‌గాంధీ వింతగా ధ్యానం కోసం విదేశాలను ఎంచుకొన్నారు’ అని బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్‌ మాల్వియ ఓ ట్వీట్‌లో ఎద్దేవా చేశారు. కాగా, రాహుల్‌ ధ్యానం చేసేందుకు విదేశీ పర్యటనకు వెళ్లింది నిజ‌మేన‌ని అయితే... ఆయన రూపొందించిన ప్రణాళిక ప్రకారమే నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: