క‌శ్మీర్ కేంద్రంగా ఇటు భార‌త‌దేశంలో అటు ప్ర‌పంచంలో తన ముద్ర‌ను వేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ మేర‌కు స‌ఫ‌లీకృతుడు అయ్యార‌ని అంటున్నారు. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి  23 మంది యూరోపియ‌న్ యూనియ‌న్‌ ఎంపీలు రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన సంగ‌తి తెలిసిందే. తిరుగు పయనమైన ఎంపీలు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో  మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరులో తాము భారత్‌కు అండగా ఉంటామని జమ్ముకశ్మీర్‌ పర్యటనకు వచ్చిన ఐరోపా యూనియన్‌ (ఈయూ) ఎంపీలు పేర్కొన్నారు. తాము భారత్‌కు స్నేహితులమని, ఉగ్రవాదం అంతానికి, శాంతి స్థాపనకు భారతీయులు చేస్తున్న కృషికి పూర్తి మద్దతునిస్తామని చెప్పారు. ఆర్టికల్‌ 370 భారత్‌ అంతర్గత విషయమని అన్నారు. ఈ పర్యటన తమకు ‘కనువిప్పు’ కలిగించిందని బ్రిటన్‌కు చెందిన లిబరల్‌ డెమోక్రాట్‌ పార్టీ సభ్యుడు న్యూటన్‌ డన్‌ చెప్పారు. ఉగ్రవాదంపై భారత్‌ పోరాటానికి అండగా ఉంటామన్నారు. తద్వారా భార‌త్‌కు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డం, త‌న వ్య‌క్తిగ‌త ప‌లుకుబ‌డి పెంచుకోవ‌డంలో మోదీ విజ‌యం సాధించార‌ని చెప్తున్నారు. 


ఫ్రాన్స్‌ ప్రతినిధి హెన్రీ మాలొస్సే మాట్లాడుతూ, తాము కశ్మీర్‌లో సైన్యం, పోలీసులతోపాటు పలువురు స్థానిక యువకులతో కూడా సంభాషించామని చెప్పారు.  ‘ఉగ్రవాదం ఓ దేశాన్ని ధ్వంసం చేయగలదు. ఆఫ్ఘనిస్థాన్‌, సిరియాలో ఉగ్రవాదం వల్ల ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూశాను. ఉగ్రవాదంపై పోరాటంలో మేము భారత్‌కు మద్దతుగా ఉంటాం’ అని ఫ్రాన్స్‌కు చెందిన మరో సభ్యుడు తియెర్రి మరియానీ అన్నారు. తమను ఫాసిస్టులు అని విమర్శించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్‌ వార్తల విషయంలో అంతర్జాతీయ మీడియా పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని పోలండ్‌కు చెందిన రైస్‌జార్డ్‌ జార్‌నెక్కీ ఆరోపించారు. ‘కశ్మీర్‌లో పర్యటించేందుకు భారత్‌లోని ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రభుత్వం అనుమతించాలి’ అని జర్మనీ ఎంపీ నికోలస్‌ ఫెస్ట్‌ అన్నారు. కాగా,  కుల్గాం జిల్లాలో ఐదుగురు వలస కూలీలను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని ఈయూ ఎంపీలు ఖండించారు. 


కాగా, ఈ ప‌ర్య‌ట‌న‌పై ఇటు మిత్ర‌ప‌క్షాలు అటు ప్ర‌తిప‌క్షాలు మోదీని టార్గెట్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈయూ ప్రతినిధుల పర్యటన.. భారత స్వేచ్ఛ, సార్వభౌమత్వంపై విదేశీ దురాక్రమణ కాదా?’ అని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ప్రశ్నించింది. దేశ తొలి ప్రధాని నెహ్రూ కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి నివేదించారంటూ విమర్శలు చేశారని, ఇప్పుడు ఈయూ ఎంపీలను కశ్మీర్‌లో పర్యటించేందుకు ఎందుకు అనుమతించారో వివరించాలని ఆ కథనంలో డిమాండ్‌ చేసింది.  ఈయూ ఎంపీల పర్యటనకు అనుమతివ్వడం ద్వారా ప్రభుత్వం దౌత్యపరమైన పెద్ద పొరపాటు చేసిందని కాంగ్రెస్‌ విమర్శించింది. మోదీ సర్కార్‌ ఉద్దేశపూర్వకంగానే కశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయ అంశంగా మార్చిందని ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్‌ సర్జేవాలా ఆరోపించారు. కశ్మీర్‌ను అంతర్జాతీయ అంశంగా మార్చేందుకు వ్యతిరేకమంటూనే ఈయూ ఎంపీల పర్యటనను ఎందుకు అనుమతించారని జేడీ(యూ) నాయకుడు పవన్‌ వర్మ ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: