కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ బాబు చనిపోవటంతో జేఏసీ ఇచ్చిన పిలుపుతో బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు. జిల్లాలోని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. డ్రైవర్ బాబు మృతదేహాన్ని కరీంనగర్ బస్ డిపో వద్దకు తీసుకొనివచ్చేందుకు జేఏసీ నేతలు ప్రయత్నం చేయగా పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. 
 
బాబు మృతదేహాన్ని బైపాస్ గుండా అతని ఇంటికి జేఏసీ నేతలు తరలించారు. అరెస్ట్ చేసిన జేఏసీ నేతలను కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు పోలీసులు తరలించారు. సీపీఎం నేతలు, ఆర్టీసీ నేతలు బస్టాండ్ దగ్గరకు భారీగా చేరుకున్నారు. బస్టాండ్ లో భారీగా మోహరించిన పోలీసులు నేతలను అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఒక బస్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. 
 
బస్ లో ప్రయాణికులు లేకపోవటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కరీంనగర్ జిల్లా ఆరేపల్లిలోని డ్రైవర్ బాబు ఇంటి దగ్గర విషాద వాతావరణం నెలకొంది. బాబు మృతదేహాన్ని చూసేందుకు ఆర్టీసీ కార్మికులు, నేతలు భారీ సంఖ్యలో బాబు ఇంటివద్దకు తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాదం నెలకొంది. ఎంపీ సంజయ్ బంద్ కు మద్ధతు ప్రకటించారు. 
 
నిన్న సరూర్ నగర్ లో జరిగిన సభలో కరీంనగర్ డిపో 2 డ్రైవర్ బాబు మరణించటం బాధాకరమని ఎంపీ సంజయ్ అన్నారు. కార్మికులెవరూ మనో ధైర్యం కోల్పోవద్దని ఎంపీ సంజయ్ అన్నారు. ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇంకెంతమంది గుండెలు ఆగిపోతే ప్రభుత్వం చలిస్తుందని ఎంపీ సంజయ్ ప్రశ్నించారు. నిన్న సకల జనుల సమ్మెలో పాల్గొన్న బాబుకు గుండెపోటు రాగా తోటి కార్మికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తోటి కార్మికులు సమ్మె పట్ల కలత చెందటంతో బాబు చనిపోయాడని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: