అధికార, విపక్షాలు ఒకరినొకరు దూషించుకోవడం సహజం. ముఖ్యంగా ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శిస్తూండటం ప్రతిపక్షం విధిగా మారిపోయింది. ప్రజల సౌఖ్యం కోసం, సంస్థల మనుగడ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని విపక్షాలు అంత హుందాగా స్వీకరించలేవు. కానీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీ సభ్యుడొకరు మెచ్చుకోవడం చర్చనీయాంశమయింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని స్వాగతిస్తూ ఓ ప్రకటన చేయడం విశేషమే.

 


‘ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అది చాలా మంచి నిర్ణయం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తుంది. ఆర్టీసీని కాపాడటాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్న కాన్సెప్ట్ చాలా గొప్పది. మంచి పని చేశారని నాకు అనిపించింది కాబట్టే చెబుతున్నా. లాభాలు వచ్చే మార్గాల్లో ప్రైవేట్ ఆపరేటర్లు బస్సులు నడుపుతారు. నష్టాలు వచ్చే మార్గంలో ప్రైవేట్ ఆపరేటర్లు బస్సులు నడపరు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు’ అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. మంత్రి పేర్ని నాని కుటుంబం కార్మిక పక్షపాతి అని కూడా మెచ్చుకున్నారు.

 


నిన్న విజయవాడలోని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర ఆసుపత్రి ఆవరణలో పేషెంట్స్ సహాయకుల కోసం తన ఎంపీ నిధులు 25 లక్షలతో నిర్మించిన వసతి గృహాన్ని ప్రారంభించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మంత్రులు పేర్ని నాని, కన్నబాబు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఎంపీ చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయ్యాయి. స్వతహాగా గతంలో కేశినాని ట్రావెల్స్ సంస్థ అధిపతి కూడా. దీంతో ట్రాన్స్ పోర్ట్ రంగంలో ఆయనకు అనుభవం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: