కళ్లు కూడా తెరవని పసికందును బ్యాగ్ లో పెట్టుకొని వెళుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఉదయం 9గంటల సమయంలో అనుమాస్పదంగా ఇద్దరు వ్యక్తులు సంచరించారు. వారి చేతిలో ఉన్న బ్యాగ్ పై ఒక ఆటో డ్రైవర్ కు అనుమానం రావటంతో ఆటో డ్రైవర్ బ్యాగ్ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జూబ్లీ బస్టాండ్ వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలో అనుమానాస్పద వ్యక్తులు ఉండగా పోలీసులు ఆ వ్యక్తుల్ని విచారించారు. 
 
పోలీసులు ఆ వ్యక్తుల బ్యాగులో ఒక చిన్నారిని గుర్తించారు. పోలీసులు చిన్నారి ఎవరని ఆ వ్యక్తులను ప్రశ్నించగా ఆ వ్యక్తులు పొంతన లేని సమాధానాలను పోలీసులకు ఇచ్చారు. ఆ వ్యక్తులు పోలీసులకు పాప తమ మనవరాలని చనిపోయిందని చెప్పారు. పోలీసులు పాపను పరీక్షించగా ఆ పాప బ్రతికే ఉందని గుర్తించారు. పోలీసులు వెంటనే ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 
 
పాపను చికిత్స కొరకు పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ పాపను జూబ్లీ బస్ స్టేషన్ వెనక భాగంలో పాతిపెట్టటానికి అనుమానాస్పద వ్యక్తులు ప్రయత్నించారని ఆటోడ్రైవర్ అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడని స్థానికులు చెబుతున్నారు. మారేడ్ పల్లి పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులు కరీంనగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసుల దర్యాప్తుకు ఆ ఇద్దరు వ్యక్తులు సహకరించటం లేదని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం వైద్యులు పాపకు చికిత్స అందిస్తున్నారు. పాపను ఎక్కడినుండి తీసుకొనివచ్చారు..? పాపకు ఆ వ్యక్తులకు సంబంధమేమిటి..? బ్రతికి ఉన్న పాపను పూడ్చిపెట్టాలని ఆ వ్యక్తులు ఎందుకు అనుకున్నారు...? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తు తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: