తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీతో ఆ పార్టీ నేతలు చర్చలు జరుపుతూనే ఉన్నారు. బుధ‌వారం అర్ధ‌రాత్రి నాలుగు గంట‌ల పాటు ఆ పార్టీకి చెందిన విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానితో పాటు మ‌చిలీప‌ట్నం మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే వంశీ మాత్రం తాను ముందుగా తీసుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు చెప్ప‌డంతో చివ‌ర‌కు వాళ్లు కూడా చేతులు ఎత్తేశారు.


ఇక ఎంపీ కేశినేని నాని అయితే పార్టీని వీడి వెళ్లవద్దని, అధినేత చంద్రబాబు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో ఎంపీ కేశినేని మాట్లాడుతూ.. వంశీకి చెప్పాల్సిందంతా చెప్పామని, బంతి ఇప్పుడు వంశీ కోర్టులో ఉందన్నారు. ఈ క్ర‌మంలోనే నాని వంశీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కుటుంబంలో, వ్యాపారాల్లో ఉన్నట్లే రాజకీయాల్లోనూ సమస్యలుంటాయని, రాజకీయంగా రాటుదేలాలంటే కొన్ని ఒత్తిళ్లు భరించకతప్పదని నాని అన్నారు.


ఇక ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల్లోనూ, ఎన్నిక‌ల్లోనూ వీరోచితంగా పోరాడి గెలిచిన వంశీ.. ఇప్పుడు వెన్ను చూపడం మంచిది కాదని హితవు పలికారు. ఒక‌సారి పారిపోవ‌డం మొద‌లు పెడితే జీవితాంతం పారిపోవాల్సిందే అంటూ వంశీపై ఓ విధంగా సెటైరిక‌ల్‌గా కూడా ఆయ‌న మాట్లాడారు. వంశీకి తెలుగుదేశం ఎంత అవసరమో పార్టీకి కూడా వంశీ అంతే అవసరమని నాని తెలిపారు.


తాము చెప్పాల్సింది చెప్పాక కూడా వంశీ ఇంకా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోనే ఉన్నారని, అంతిమంగా నిర్ణయం ప్రకటించాల్సింది ఆయనేనని కేశినేని స్పష్టం చేశారు. ఇక ఈ చ‌ర్చ‌లు ఫెయిల్ అవ్వ‌డంతో టీడీపీ నేత‌లు కూడా వంశీపై పూర్తిగా ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఇక వంశీ కూడా వైసీపీలోకి వెళ్లేందుకు న‌వంబ‌ర్ 3 లేదా 4వ తేదీలు అంటూ ముహూర్తం కూడా పెట్టుకున్న‌ట్టు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: