విశాఖపట్నం అంటే సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. ప్రక్రుతి ప్రేమికుల గమ్యస్థానంగా చెప్పుకుంటారు. విశాఖ సినీజీవులకు ఎవర్ గ్రీన్ హీరోయిన్. ఎప్పటికీ వసివాడని పదహాఏళ్ళ పరువంతో వెండితెరను సుసంపన్నం చేసిన ఘనత విశాఖదే అంటారు. అందాల నగరం, ఆర్ధిక నగరం, ఐటీ హబ్ ఇలా విశాఖకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇపుడు మాత్రం విశాఖకు మరో పేరు ట్యాగ్ చేస్తున్నారు. నేర విశాఖ అంటున్నారు. ఘోర విశాఖ అని కూడా అంటున్నారు. ఎందుకిలా..


అంటే విశాఖలో ఒకప్పటి ప్రశాంతత ఇపుడు లేదనే మాట వినిపిస్తోంది. ఎక్కడ చూసినా నేరాలే కనిపిస్తున్నాయి. బయటకు వెళ్ళే అమ్మాయిలకు రక్షణ లేదా అనుకుంటే ఇంట్లో ఉన్న వారిని కూడా హత్య చేసే కల్చర్ పెరిగిపోయిందని అంటున్నారు. దీనికి వరసగా జరుగుతున్న సంఘటనలనే ఉదాహరణంగా చెబుతున్నారు. విశాఖకు తలమానికంగా ఉండే కైలాసరిగి ఇప్పుడు అత్యాచారానికి కేంద్రం అయిందని తెలిసే సిగ్గుతో తలవంచుకోవాలి. పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం అయింది. కైలాసరి గిరి మీద శివపార్వతులు వెలిసిఉన్నారు. వారిని దర్శించుకోవడానికి అటు పర్యాటకులు, ఇటు భక్తులు కూడా వస్తారు. అటువంటి చోట ఓ అన్యాయం జరిగిపోయింది.


స్నేహం పేరిట నమ్మించి తీసుకువచ్చిన ఓ యువతిని నలుగురు యువకులు దారుణంగా ఇదే కైలాసగిరి కొండ మీద అత్యాచారం చేసిన ఘటనని విన్న విశాఖ షాక్ తింది. ఉలిక్కిపడింది. వరసగా ఒకరి తరువాత ఒకరు ఆ యువతి మీద అత్యాచారం చేస్తూంటే నిత్యం  రద్దీగా ఉండే కైలాసగిరి మీద భద్రత తీరు ఇంతేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇది సభ్యసమాజం సిగ్గుపడాల్సిన విషయం అని ప్రజాసంఘాలు అంటున్నాయంటే పోలీసులు ఎంతలా ఫెయిల్ అయ్యారో అర్ధమవుతోందిగా.


ఇక ఇదే విశాఖలో కొద్ది రోజుల క్రితం అక్కయ్యపాలేం అనే ఏరియాలో అప్పలనరసమ్మ అనే మహిళను హత్య చేశారు. ఇందులో ముద్దాయి ఒక మెకానిక్. అది కూడా పట్టపగలు జరిగిన ఘటన. మరి దీని ముందు కూడా ఇదే తీరున నగరంలో వేధింపులు, ఆత్మహత్యలు, కిడ్నాపులు జరుగుతూనే ఉన్నాయి. మరి కొంత దూరం వెనక్కి వెళ్తే విశాఖ జిల్లా చోడవరంలో పట్టపగలు ఓ యువకున్ని నడి రోడ్డు మీద నరికిన దారుణం కనిపిస్తుంది. విశాఖలో మహిళలు సైతం భయపడేలా ఘాతుకాలు జరుగుతున్నాయి. కీచకులు నిర్భయంగా జనవాసాల్లోకి ప్రవేశించి దందా చేస్తున్నారు. మరి దీన్ని ఇక్కడితో ఆపకపోతే, మొగ్గలోనే తుంచకపోతే విశాఖ నేర నగరం అన్న అపఖ్యాతిని తెచ్చుకోవడం ఎంతో దూరంలో లేదని  నగరవాసులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: