ఈ రోజు ఉదయం 9 - 9:30 గంటల సమయం, హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ దగ్గరలోని ఒక ఆటో డ్రైవర్ ఆటోను ఆపాడు. ఆ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో మూత్ర విసర్జనకు వెళ్లాడు. అదే సమయానికి అక్కడ ఇద్దరు వ్యక్తులు తచ్చాడుతూ కనిపించారు. అందులో ఒకరి చేతిలో బ్యాగ్‌ లాంటిది ఉండగా, మరొకరేమో గుంత తవ్వుతున్నారు. కాస్త నిధానంగా పరిశీలించి ఆ వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగ్ కాదు పసికందును చుట్టి ఉంచిన ఒక ఉన్ని సంచి అని నిర్ధారించుకున్నాడు. మరి ఆ గుంత ఎందుకు తవ్వుతున్నారు అనే ప్రశ్న అతడిలో మొదలు అయింది.


అంతే, దీనితో వెంటనే అక్కడి నుంచి హుటాహుటిన వచ్చేసి దగ్గర్లోనే విధులు నిర్వహిస్తోన్న కానిస్టేబుల్ వెంకట రామకృష్ణను కలిశాడు. తను చూసిందంతా అతడితో చెప్పి నాకెందుకో అనుమానంగా ఉంది అన్నాడు. ఆ కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి చూడగా, ఒకాయన చేతిలో పసి పాప కనిపించింది వాళ్లకి.


కానిస్టేబుల్ వాళ్లని మీరెవరు..? ఇక్కడ మీకేం పని? ఆ గుంత ఎందుకు తవ్వుతున్నారు? అని గట్టిగా నిలదీసి అడిగాడు. దీనితో తమది కరీంనగర్ అని, ఆపరేషన్ ఫెయిల్ కావడంతో తమ మనవరాలు చనిపోయిందని, ఆర్టీసీ బస్సులో సొంతూరు పోదామంటే చనిపోయిన పాపను తీసుకెళ్లనీయడం లేదని పాపను ఈ గ్రౌండ్లో పూడ్చి పెడదామని భావించామని అందుకే గుంత తవ్వుతున్నామని వాళ్లు చెప్పారు.


వాళ్లు చెప్పిన సమాధానం ఎందుకో సంతృప్తికరంగా అనిపించలేదు కానిస్టేబుల్ కు. దీంతో ఆ కానిస్టేబుల్ ఆ వ్యక్తి చేతిలో ఉన్న పాపను చూడగా మూడు రోజుల క్రితమే పుట్టిన ఆ పసికందు బతికే ఉంది. ఆ పాప అటు ఇటు కదులుతూ కనిపించింది. దీనితో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఆ పాపను పూడ్చిపెట్టడానికి ప్రయత్నించిన ఆ ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: