తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ‘సకల జనభేరి’ సభను నిర్వహించారు. ఈ స‌భ‌కు టీఆర్ఎస్ మిన‌హా మిగ‌తా పార్టీల నేతలంతా విచ్చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా సమ్మె విరమించవద్దని, తాము,  తెలంగాణ సమాజం అండగా ఉంటామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు. అయితే, మ‌రుస‌టి రోజే...ఆర్టీసీ కార్మికులు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సంఘీభావం కోరారు.


ఇసుక అందుబాటులో ఉంచకపోవడంతో ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్‌తో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించ తలపెట్టారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా, ఆయా పార్టీల అగ్రనాయకులతో ఫోన్లో మాట్లాడారు ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో ఈ విషయమై మాట్లాడిన‌పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె కోసం అక్కడి రాజకీయపక్షాలు ఎటువంటి స్ఫూర్తి చూపుతున్నాయో ఇసుక సమస్య పరిష్కారానికి, లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మళ్ళీ ఉపాధి లభించేలా సమైక్యంగా అన్ని రాజకీయ పక్షాలు ముందుకు వెళ్లాలని  ప‌వన్ కళ్యాణ్ కోరారు. 


అయితే, ఈ చ‌ర్చ జ‌రిగిన మ‌రుస‌టి  కార్మికుల జేఏసీ ప్ర‌తినిధులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌ల‌వ‌డం విశేషం. హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో....ఆర్టీసీ జేఏసీ నేత‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా విన‌తి ప‌త్రం అంద‌జేసి త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. తాము ఎదుర్కుంటున్న వివిధ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. కార్మికుల‌కు అండ‌గా తానుంటానని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన‌ట్లు స‌మాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: