మూడేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపి కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి సంగారెడ్డి న్యాయస్థానం జీవిత కాలం  జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. అంతే కాకుండా అతనికి కోర్టు రూ. 5 వేలు జరిమానా విధించింది.  తమిళనాడు రాష్ట్రానికి చెందిన పి శ్రీనివాస్ (57) బతుకు దెరువు కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు.  సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం మూర్తి నగర్ లో ఉంటూ వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. 2017 డిసెంబర్ 31న రామచంద్రాపురం (ఆర్సీపురం) ప్రాంతానికి చెందిన ఓ బాలిక (3) తల్లిదండ్రులతో కలిసి ఇంటి సమీపంలో ఉన్న కూరగాయలు కొనేందుకు వెళ్ళింది. అదే సమయంలో శ్రీనివాస్ మద్యం తాగి ఇంటికి వెళుతున్నాడు.



స్థానికంగా ఉన్న గ్రేవ్ యార్డ్ సమీపంలో ఏడుస్తూ ఓ బాలిక కంట పడింది. దీంతో శ్రీనివాస్ బాలికకు బిస్కెట్ ఇప్పిస్తానని చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి లైంగికదాడి చేశాడు. దీంతో బాలిక గట్టిగా ఏడవటంతో శ్రీనివాస్ అక్కడ నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి శ్రీనివాస్ను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్రీనివాస్ ను రిమాండ్ కు పంపించారు. కేసు విచారణలో భాగంగా మంగళవారం సంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి బి. పాపి రెడ్డి నిందితుడు శ్రీనివాస్ కు రూ. 5 వేలు జరిమానా, జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.



సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ కేసు విచారణలో సహకరించిన పోలీస్ సిబ్బంది సేవలను ప్రశంసించారు. అప్పటి మియాపూర్ ఏసిపి రవికుమార్, ఆర్ సి పురం ఇన్స్పెక్టర్ జె.రమేష్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ రెడ్డి, రైటర్లు ఎస్సై భాస్కర్, రామ్ చందర్, కానిస్టేబుల్లు సల్మాన్, నారాయణ, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు గాల్ రెడ్డి, సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి అనసూయ, కోర్ట్ మానిటరింగ్ సెల్ అడిషనల్ డిసిపి ఇందిరలను సైబరాబాద్ సిపి సజ్జనార్  అభినందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: