గత కొన్ని రోజులుగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన వల్లభనేని వంశీ వ్యవహారం మెల్ల మెల్లగా ఓ కొలిక్కి వస్తుంది. తనపై ఫోర్జరీ కేసుల నేపథ్యంలో వంశీ టీడీపీకి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి, టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపిన విషయం తెలిసిందే. అలాగే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా ప్రకటించారు. అయితే బాబు మాత్రం, పార్టీ అండగా ఉంటుందని, కలిసి వైసీపీ మీద పోరాడదామని వంశీకి సూచించారు. అలాగే వంశీని బుజ్జగించేందుకు ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణలని కూడా పంపారు.


అయినా సరే వంశీ ఏ మాత్రం వెనక్కి తగ్గకపోగా, చివరికి వైసీపీలోకి వెళ్ళేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. నవంబర్ 3 లేదా 4వ తేదీల్లో  వంశీ వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉంది. అయితే వైసీపీలోకి వస్తే జగన్ పెట్టిన కండిషన్ ప్రకారం వంశీ తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక దాన్ని స్పీకర్ ఆమోదిస్తే ఆరు నెలల్లో గన్నవరం స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇక ఈ ఎన్నిక బరిలో వైసీపీ వంశీని దించే అవకాశముంది.


ఇక వంశీ బరిలోకి దిగితే...ఆయన్ని గెలిపించే బాధ్యత మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కొడాలి నాని, పేర్నినానిలదే అవుతుంది. ఎందుకంటే వీరే వంశీ వైసీపీలో చేరడంలో ముఖ్య పాత్ర పోషించారు. పైగా కొడాలి నాని వంశీకు సన్నిహితుడు కూడా.  కాబట్టి వీరిద్దరే వంశీని గెలిపించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ వంశీ గెలవడం సులువే.


ఇక వంశీని జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళ్లిన‌ప్పుడు కూడా జ‌గ‌న్ మ‌ళ్లీ వంశీని గెలిపించే బాధ్య‌త మీదే అని చెప్పిన‌ట్టు టాక్‌.  కానీ గన్నవరం టీడీపీ కంచుకోట కాబట్టి తక్కువ అంచనా వేయలేం. కాబట్టి ఇద్దరు మంత్రులు జాగ్రత్తగా వ్యూహాలు రచించుకుని వంశీని గెలిపించుకోవాలి. లేదంటే వారి పరువు పోతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: