రాజ‌కీయాల్లు ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. అన్ని రోజులూ ఒకేలా ఉండ‌వు. నాయ‌కుల హ‌వా కూడా ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితి వ‌స్తుందో చెప్ప‌లేని రోజులు. ఇలాంటి ప‌రిస్థితే.. ఇప్పుడు తెలంగాణ‌లో మాజీ మంత్రి, ఎస్టీవ‌ర్గానికి చెందిన నాయ‌కుడు చందూలాల్ ఎదుర్కొంటున్నారు. టీఆర్ ఎస్‌లో అధినేత‌కు అత్యంత స‌న్నిహితుడైన చందూలాల్ 2014 ఎన్నిక‌ల్లో ములుగు నియ‌జ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. ఆ వెంట‌నే ఆయ‌న కేసీఆర్ ఆశీస్సుల‌తో మంత్రి వ‌ర్గంలోనూ సీటు సంపా యించుకున్నారు. అయితే, ఆయ‌న అధికారంలో ఉన్న‌స‌మ‌యంలో కేవ‌లం త‌న వారికి మాత్ర‌మే సాయం చేశార‌ని, ప‌ద‌వులు ఇప్పించుకున్నార‌నే ప్ర‌చారం మాత్రం జోరుగా సాగింది.


కేసీఆర్‌కు స‌న్నిహితుడు కావ‌డంతో ఎవ‌రూ పైకి విమ‌ర్శించ‌లేక పోయారు.అ దేస‌మ‌యంలో చందూలాల్ అనారోగ్యానికి గురైనా.. మంత్రిగా ఆయ‌న‌ను ఎక్క‌డా తొలిగించ‌కుండా.. ఐదేళ్ల‌పాటు కొన‌సాగించారు కేసీఆర్‌. ఈ క్ర‌మంలోనే చందూలాల్ కుమారుడు రాజ‌కీయ వార‌సుడిగా రంగంలోకి దిగారు. కానీ, ఆయ‌న వ్య‌వ‌హార శైలితో నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు మ‌రింత‌గా చందూకు దూర‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది డిసెంబరు లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో చందూలాల్ కు టికెట్ ఇచ్చినా.. ప్ర‌జ‌ల్లో అంత‌ర్గ‌తంగా చోటుచేసుకున్న వ్య‌తిరేక‌త కార‌ణంగా ఓట‌మిపాల‌య్యారు.  ఈ ప‌రిణామంతో ఒక్క‌సారిగా టీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వం ఖంగుతింది.


చందూలాల్ వ్య‌వ‌హార శైలిని ప‌రిశీలించింది. ఆయ‌న వ‌ల్ల పార్టీకి, నియోజ‌క‌వ‌ర్గానికి ఎలాంటి మేలు జ‌ర‌గ‌లేద‌ని ఈ సంద‌ర్బంగా పార్టీ అధిష్టానం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింద‌ని ములుగు జిల్లాలో ప్రచారం సాగింది. ఈ క్ర‌మంలోనే ములుగు జిల్లాలో టీఆర్‌ఎస్‌ పట్టు నిలుపుకోవడానికి మాజీమంత్రి చందూలాల్ కు చెక్ పెట్టి, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్‌ను, అక్కడ ప్రత్యామ్నాయ నేతగా తయారు చేస్తోందని అర్థమవుతోంది. దాని కోసమే మొన్నటి జెడ్పిటిసి ఎన్నికల్లో జనరల్ స్థానం ఏటూరు నాగారం నుంచి పోటీ చేయించి, జెడ్పి చైర్మన్ స్థానాన్ని కట్టబెట్టారని చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లూ మాజీమంత్రి చందూలాల్‌తో ఇబ్బందిపడ్డ వర్గం సైతం జగదీష్ కు జై కొడుతున్నారు.


ఇదిలావుంటే, ఇన్నాళ్లు ఓ రేంజ్‌లో సాగిన చందూలాల్ రాజ‌కీయాల‌కు చెక్ ప‌డుతుంద‌ని తెలియ‌డంతో ఆయ‌న , ఆయ‌న కుటుంబం కూడా కుమిలిపోతోంద‌ని స‌మాచారం. ముఖ్యంగా రాజ‌కీయ వార‌సుడి వ్య‌వ హార శైలితోనే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డంతో చందూలాల్ ఈ ప‌రిస్థితిని జీర్ణించుకోలేక పోతున్నార‌ట‌. అటు పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉండటం, ఇటు క్షేత్రస్థాయి లో శ్రేణుల సహాయ నిరాకరణతో, అల్లాడిపోతున్నారట చందూలాల్‌. సో.. మొత్తానికి స్వ‌యంకృతం, వార‌సుడి వీర విహారంతో ఆ నేత‌కు అడ్ర‌స్ గ‌ల్లంత‌వుతోంద‌నే వ్యాఖ్య‌లు జోరుగానే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: