అసెంబ్లీ ఎన్నిక‌ల‌ ఫలితాలు వెలువడి వారం గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా పీటముడి వీడలేదు. అధికారం చెరిసగం పంచుకోవాలని శివసేన వాదిస్తుండగా.. బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ స‌మ‌యంలోనే...శివసేన అనూహ్య నిర్ణయం తీసుకుంది. శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత ఉద్దవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేని ఎన్నుకోనున్నారన్న ఊహాగానాలకు తెరదించింది. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాథ్‌ షిండేని ఎన్నుకున్నారు. 


నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కూడిన శివసేన శాసనసభాపక్షం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఏక్‌నాథ్‌ షిండే పేరును ఆదిత్య ఠాక్రే ప్రతిపాదించగా.. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అటు ఈ సాయంత్రం శివసేన సభ్యులంతా గవర్నర్‌ని కలిశారు. ఇదిలాఉండ‌గా, మహారాష్ట్ర సీఎం పదవిపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండగానే కేంద్రమంత్రి, ఆర్పీఐ నేత రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల కాలంపాటు పూర్తిస్థాయి ముఖ్యమంత్రే తమకు కావాలని ఆయన స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవిస్‌కే తాము మద్దతు ఇస్తామంటూ కుండబద్దలు కొట్టేశారు. సీఎం పదవి కోసం ఆయనకే మద్దతు ఇవ్వాలని పార్టీలో నిర్ణయం తీసుకున్నట్లు రాందాస్ స్పష్టం చేశారు.

 

288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105 సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ 17 సీట్లను కోల్పోయింది. శివసేన 56 సీట్లను గెలుచుకుంది.మహారాష్ర్ట ప్రజల ప్రయోజనాల దృష్ట్యా శివసేన.. బీజేపీతో కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నదని శివసేన పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. అయితే, ‘పార్టీ గౌరవం’ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. 50-50 ఫార్ములాపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ముందుగా నిర్ణయించిన ప్రకారం అన్నీ జరుగాలి’ అని సమాధానమిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటుకు అంత తొందరేమీ లేదని, కొత్త మంత్రి మండలిని తొందరగా ఏర్పాటు చేయకపోతే, తమ పార్టీలో చీలికలు ఏర్పడే అవకాశం ఉన్నదన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. మరోవైపు, మహాకూటమి మహారాష్ర్టలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ బుధవారం స్పష్టం చేశారు. దక్షిణ ముంబైలోని విధాన భవన్‌లో బుధవారం సమావేశమైన ఆ రాష్ర్ట బీజేపీ ఎమ్మెల్యేలు ఫడ్నవీస్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, పార్టీ ఉపాధ్యక్షులు అవినాశ్‌ రాయ్‌ ఖన్నా ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ శాసనసభా పక్షనేతగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆ పార్టీ నాయకత్వం తిరిగి ఎన్నుకోవడంతో మిత్రపక్షం శివసేన తన భవిష్యత్‌ కార్యాచరణను సిద్ధం చేయడంలో మరింత వేగం పెంచి శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌ను ఎన్నుకుంది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: