గగనతల సముద్రానికి గండి పడిందా అనేట్లు కురుస్తున్న వర్షాలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే అయినప్పటికీ అకాల వర్షం కారణంగా చాలా చోట్ల పంట పొలాలు నేలకొరిగాయి.


 అన్నదాతల ఆర్తనాదాలు మిన్నంటేట్లు వరుణుడు ప్రళయకాల రుద్రునివలే విరుచుకుపడుతున్నాడు. ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రాల్లో పలు చోట్ల కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలంలోని సదర్ పూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.  రెక్కాడితే గాని డొక్కాడని రైతు కుటుంబంలోని మహిళలు అయిన మండల కేంద్రంలోని అశోక్ నగర్ కు చెందిన కనక దేవి(35) మరియు జనోని గ్రామానికి చెందిన ప్రేమల(28) ఈ రోజు ప్రత్తి చేనులో కూలి పనికి వెళ్లారు. 


 కాగా వారు చేను లో కలుపు తీస్తున్న సమయంలో వర్షం పడడం మొదలవడంతో చేనుకు సమీపంలో ఉన్న చెట్టు కిందికి తలదాచుకునేందుకు వెళ్లారు. అయితే కొద్ది సమయంలోనే భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షం పెరిగి పోవడం జరిగింది . జోరువానలో ఎటు వెళ్లలేని స్థితిలో ఉన్నవారు చెట్టు కిందనే ఉండే పరిస్థితి ఏర్పడింది. 


అయితే క్రమేపీ ఉరుములు మెరుపులు పెరిగి వారి పైన పిడుగు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది.  అకాల వర్షాలు తమ కుటుంబంలోని వ్యక్తులను బలి తీసుకుని వారి కుటుంబాలలో చీకటిని నింపాయని  కుటుంబసభ్యులు రోదించారు.  గ్రామస్తులు మాత్రం ఆ పేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటే  బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు


మరింత సమాచారం తెలుసుకోండి: