చైనాలో ఓ కార్ల కంపెనీ మనుషుల ప్రాణాలు కాపాడటం కోసం చేస్తున్న  ప్రయోగాలు వివాదంగా మారాయి.  కార్లలో సీట్ బెల్టుల నాణ్యతను పరీక్షించేందుకు ఓ కంపెనీ సజీవంగా ఉన్న పందులను సీట్లకు కట్టేసి ఆ కార్లను గోడలకు ఢీ కొట్టించే పరీక్షలు జరిపిందని జర్మనీకి చెందిన బిల్డ్ అనే పత్రికకు అన్నే మర్టే అనే పర్యావరణవేత్త సమాచారమందించాడు. సజీవంగా ఉన్న దాదాపు 15 పందులపై ఇలాంటి ప్రయోగాలు జరిపారని వాటిలో దాదాపు ఎనిమిదికి పైగా పందులు మరణించాయని ఆయన ఆ పత్రికకు వెల్లడించాడు.


  చైనాలో పలు పరీక్షలకు వాడే పందులను గిన్నీ పిగ్స్ గా పిలుస్తారు. వీటిని కార్లలో పిల్లల సీట్లకు వాడే సీట్ బెల్టుల నాణ్యతను పరీక్షించేందుకు ప్రయోగాల్లో వాడుతారు. ఈ పందులను సీట్ బెల్టులకు కట్టేసి గంటకు ముప్ఫై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గోడలను ఢీ కొట్టిస్తారు. ఈ ప్రయోగంలో కొన్ని పందులకు లోపలి ఎముకలు విరగడం, అంతర్గత రక్తస్రావడం కావటం వంటివి జరగడాన్ని పరీక్షించి నాణ్యత ప్రమాణాలను నిర్థారిస్తారు. ఈ గిన్నీ పిగ్స్ చిన్న పిల్లల ఎత్తుకు సమానంగా ఉండటంతో ఈ ప్రయోగాలకు వీటిని వాడుతున్నారు
 
   ప్రయోగాలకు కొన్ని గంటల ముందు నుంచి ఈ పందులను తిండిపెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా హింసిస్తున్నారని.. మనుషుల ప్రాణాలు కాపాడే పరీక్షల కోసం వాటి ప్రాణాలను తీస్తున్నారని జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనుషులవైతేనే ప్రాణాల.. మిగితా జంతువులవి మాత్రం ప్రాణాలు కావా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రయోగాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు 


  1990 వరకు అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ కూడా పందులపై ఇలాంటి ప్రయోగాలే చేయగా.. అప్పట్లో జంతు కారుణ్య కార్యకర్తలతో ఆందోళనతో దాన్ని విరమించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: