జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో ప్రజలకు మరింత సాధికారత కల్పించేందుకే ఆర్టికల్ 370ని తొలగించారని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా రాజకీయ పార్టీలు జమ్మూకశ్మీర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు ప్రకటనలు చేయకపోవడమే మంచిదని ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జాతీయ ఏకతా దినోత్సవం’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 
సమైక్య భారత నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి 560కుపైగా సంస్థానాలు భారత్‌లో విలీనం చేసిన నవభారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి నేటికీ ఆదర్శనీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఒక క్రాంతదర్శిగా, నవభారత నిర్మాతగా, రాజనీతిజ్ఞుడిగా పటేల్‌కు జాతియావత్తూ ఘనంగా నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఐక్యత మరియు మరింత ఐక్యత’ అనే స్ఫూర్తి మంత్రాన్ని ప్రవచించి.. భారతదేశాన్ని ఏకం చేసే లక్ష్యాన్ని స్వయంగా స్వీకరించిన సర్దార్ పటేల్ ఆలోచనలు నేటికీ అత్యంత అనుసరణీమమన్నారు.



పటేల్ తన వ్యూహం, సహనం, శాంతి, గౌరవ ప్రదంగా ఒప్పించే మార్గాల్లో విజయం సాధించారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. పటేల్ కృషి గురించి చివరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్  అన్న ‘భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కలపడం. ప్రస్తుత (1947లో)ప్రభుత్వం సాధించిన అతి కీలకమైన ఘనత. ఈ ప్రయత్నంలో విఫలమై ఉంటే ఫలితం చాలా తీవ్రంగా ఉండేది. కానీ భారత్ ఈ విషయంలో విజయం సాధించింది. ప్రతికూల దృక్పథంలో వెళ్ళాల్సిన ఓ విషయాన్ని సానుకూల మార్గం దిశగా మళ్ళించారు’ అని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ ఘనత.. పటేల్ సంఘటితత్త్వ స్ఫూర్తికి నిదర్శనమన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్ర ప్రజలను సెప్టెంబర్ 17, 1948 న విముక్తం చేశారని.. ఇలాంటి సందర్భాలు, రాజ్యాలు ఎన్నో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో పటేల్ వ్యక్తిత్వం ఉక్కు కంటే కఠినమైనది. వ్యక్తిగతంగా, మానవ సంబంధాల విషయంలో పువ్వు కంటే మృదువైనది’ అని పటేల్ జీవిత చరిత్ర రాసిన రచయిత నహరి పరిఖ్ పేర్కొన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.



‘సర్దార్ ఉక్కు, రేకులతో ఒక దేశాన్ని నిర్మించారు. చరిత్ర దాన్ని అనేక పేజీల్లో లిఖిస్తుంది. వారిని నవభారత నిర్మాతగా కీర్తిస్తుంది, వారి గురించి మరెన్నో గొప్ప విషయాలు చెబుతుంది’ అని ప్రథమ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ చెప్పిన విషయాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రతికూల గతాన్ని తవ్వడానికి పటేల్ ఎప్పుడూ ఆసక్తి చూపలేదని.. ఆపరేషన్ పోలో విజయవంతమైన తర్వాత నిజాం రాజును ఉద్దేశించి ‘ఇలాంటి క్లిష్టమైన కాలంలో మీ గొప్ప వ్యక్తిత్వం భారతదేశానికి విలువైన ఆస్తి అంటూ ప్రశంసించా’రని ఉపరాష్ట్రపతి అన్నారు. 1946లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలన్న గాంధీ సూచనను వినమ్రంగా, ఉన్నతమైన మనసుతో అంగీకరించిన విషయాన్ని నేటి సమాజం గుర్తుంచుకోవాలన్నారు. 




భారతీయ పౌరసేవల వ్యవస్థ నిర్మాతగా పటేల్ సేవలను మరిచిపోలేనివని.. దేశ ఐక్యత మరియు సమగ్రతను ప్రోత్సహించే దిశలో అఖిల భారత సేవలను ఒక ముఖ్యమైన శక్తిగా ఆయన భావించారరన్నారు. పటేల్ తనకోసం కాకుండా మాతృభూమి కోసమే జీవిస్తారన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ మాటలను కూడా ఆయన గుర్తుచేశారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్ ను జరుపుకుంటున్న సందర్భంలో ప్రతి భారతీయుడు భారతదేశ ఐక్యత, సమగ్రత, భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కృషి చేసేందుకు ప్రతినబూనాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అన్నారు. భారతదేశ చరిత్ర పుటలపై చెరగని ముద్ర వేసిన గొప్ప నాయుకుడు, దిగ్గజ వ్యక్తిత్వం, దూరదృష్టి గల నాయకత్వ లక్షణాలు ఉన్న రాజనీతిజ్ఞుడిని గౌరవించుకునేందుకు ఇదే ఉత్తమైన మరియు ఏకైక మామన్నారు. కుల, మత వ్యత్యాసాలు కూకటి వేళ్ళతో సహా కూలిపోవాలని.. అంటరాని తనాన్ని బహిష్కరించాలని ఆకలి లేని సమాజాన్ని సృష్టించాలని పటేల్ కలలుగన్న పటేల్ ఈదిశగా ఆయన చేసిన ప్రయత్నంతో మనందరి దృక్పథాల్లో మార్పు రావలసిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పటేల్ ఆలోచనలైన ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ మరియు సబ్ కా విశ్వాస్’ ఆదర్శాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: