తెలంగాణ మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఢిల్లీలో రెండవరోజు సైతం బిజీబిజీగా గడిపారు. బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన కేటీఆర్ గురువారం కూడ ఢిల్లీలోనే ఉండి పలువురు కేంద్రమంత్రులకు కలిశారు. రాష్ట్రానికి చెందిన సమస్యలకు వినతిపత్రాలు అందించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్..కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. 


దేశ రాజధాని ఢిల్లీలో మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టేట్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్ సదస్సుకు హజరైన రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రెండోరోజు డిల్లీలోనే తన పర్యటన కొనసాగించారు.  బేగంపేట సమీపంలోని రసూల్‌పుర వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఇంటర్ స్టేట్ పోలీస్ క్వార్టర్స్ కు చెందిన 1. 62 ఎకరాల స్థలాన్ని జి.హెచ్.ఏం.సి కి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.


 దీనికి ప్రత్యామ్నాయంగా మరో స్థలంలో క్వార్టర్స్ నిర్మించి ఇస్తామని అమిషాకు తెలిపారు కేటీఆర్..అంతకుముందు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమైన కేటీఆర్.. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. 
ఖమ్మం జిల్లాలో గ్రానైట్ రవాణా కోసం రైల్వే సైడింగ్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రానైట్ రవాణ కోసం రైల్వే సైడింగ్ సదుపాయం కల్పించాలని , దీని వల్ల గ్రానైట్‌తో పాటు సిమెంట్, ఇనుము, ఇతర పండ్ల రవాణకు ఈజీ అవుతుందని వివరించారు.


విజయవాడ నుంచి నల్గొండ మీదుగా హైదరాబాద్ కు రోజువారీ పాసింజర్ రైలు నడపాలని పీయూష్ గోయల్ ను కోరారు కేటీఆర్. ఇక బుధవారం కూడ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కి హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ - రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రహదారులు రవాణావసరాలకు సరిపోవడం లేదని ఆయన మంత్రికి వివరించారు. స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిదని, ఇందుకోసం భూముల అప్పగింతపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ను మంత్రి కేటీఆర్‌ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: