ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జగన్ సర్కార్ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది . మూడు రోజుల పాటు అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది . విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది . ఇంతవరకూ ... అంతాబాగానే ఉన్నప్పటికీ , అవతరణ దినోత్సవ వేడుకల కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికల్లో జాతిపిత మహాత్మాగాంధీ , గవర్నర్  విశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి .


 ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం , రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఫొటో ను విస్మరించడం పట్ల పలువురు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వ వైఖరి పట్ల ఆర్యవైశ్య సంఘాల నేతలు మండిపడుతున్నారు . అమరజీవి పొట్టి శ్రీరాములు ను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని ఆర్యవైశ్య సంఘం యువజన విభాగం అధ్యక్షుడు వెంకటప్రసాద్ ఒక ప్రకటన లో విమర్శించారు . అవతరణ వేడుకలకు సంబంధించిన ప్రచార చిత్రం , ఆహ్వాన పత్రిక , కరపత్రం లో ఎక్కడ కూడా పొట్టి శ్రీరాములు పేరు కానీ ఫొటోను ముద్రించకపోవడం పట్ల అయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు .


 అవతరణ దినోత్సవ   ఆహ్వానపత్రం , కరపత్రం , ప్రచార చిత్రాల్లో  ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా పొట్టి శ్రీరాములు ఫొటోను లేకుండా ముద్రించాలని ఆదేశించిందా ?, లేకపోతే సాంస్కృతిక శాఖ అధికారుల వల్ల పొరపాటు జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది . ఈ విషయం పై ప్రభుత్వం దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని , ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ విన్పిస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: