ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుల జాతర వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి మొదలైంది. పోలీస్ ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పబోతున్నట్లు సమాచారం. పోలీస్ నియామక మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాల భర్తీ కొరకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. పోలీస్ నియామక మండలి ఏపీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని 11,500 పైగా పోస్టుల భర్తీ కొరకు ప్రతిపాదనలు పంపింది. 
 
పోలీస్ నియామక మండలి పంపిన ప్రతిపాదనలలో 11,356 కానిస్టేబుల్ పోస్టులు, 340 సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు ఉన్నాయని సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం నవంబర్ చివరినాటికి ఆయా శాఖల నుండి ఉద్యోగ ఖాళీల వివరాలను పంపాల్సిందిగా శాఖాధిపతులను గతంలో ఆదేశించారు. 
 
2018 సంవత్సరంలో 3,137 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి కావటంతో పోలీసు నియామక మండలి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయటంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జూన్ నెల 19వ తేదీ నుండి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు అవుతోంది. ప్రభుత్వం వీక్లీ ఆఫ్ అమలు చేస్తూ ఉండటంతో పోలీస్ శాఖ అదనపు సిబ్బందిని నియమించుకోవాల్సి ఉందని తెలుస్తోంది. 
 
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇప్పటికే 2 లక్షలకు పైగా గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు మరియు 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం జనవరి నెల మొదటి వారంలో ఉద్యోగ క్యాలెండర్ ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగాలను కేటగిరీలుగా విభజించి ఒక్కో గ్రూపులోని పోస్టులకు ఏపీపీఎస్సీ ఇకపై ఒకే పరీక్షను నిర్వహించబోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: