ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంపీ గా ఉన్నప్పుడు ఆయనపై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన అప్పటి నుంచి ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరై విచారణలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ సంపాదించుకుని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు జగన్ మోహన్ రెడ్డి. అయితే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కూడా  కోర్టుకు హాజరు అవుతున్నారు. ఈనేపథ్యంలో అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి  వ్యక్తిగత హాజరు మినహాయింపుపై కోర్టును విజ్ఞప్తి చేశారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడానికి తనకు ఇబ్బంది ఏమీ లేదని ... కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండడం వల్ల ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉంటుందని... కోర్టుకు హాజరు అయితే అధికారిక విధులకు ఆటంకం ఏర్పడే అవకాశం  ఉందని  పిటిషన్ దాఖలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 



 అంతేకాకుండా ముఖ్యమంత్రి హోదాలో  సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవడానికి వస్తే ప్రోటోకాల్ కోసం రోజుకు 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నదని  పిటిషన్లో తెలిపారు జగన్ . ఇప్పటికె  ఆర్థిక ఇబ్బందుల్లో  ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది మరింత భారంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి తనకు బదులుగా తన న్యాయవాది కోర్టుకు హాజరయ్యేందుకు అనుమతించాలని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసారు. అంతేకాకుండా సిబిఐ కోర్టు విచారణకు హాజరు అవడం వల్ల ప్రజలకు మెరుగైన పాలన అందించలేక పోతున్నాం అని ఆయన తెలిపారు. 



 కాగా  జగన్ పిటిషన్ పై సీబీఐ మాత్రం సానుకూలంగా లేదు. జగన్ పిటిషన్ పై తీవ్రంగా వ్యతిరేకించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభియోగాలు మామూలువి కాదని తీవ్ర అభియోగాలు అని సీబీఐ పేర్కొంది. అయితే గతంలో ఎంపీ గా ఉన్నప్పుడే జగన్ సాక్షులను ప్రభావితం చేశారని తెలిపిన సీబీఐ .... ఇప్పుడు ఏకంగా సీఎం హోదాలో ఉండడంతో ఆ అవకాశాలు మరింత ఎక్కువ ఉన్నాయని వాదించింది. కాబట్టి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు పై మినహాయింపు ఇవ్వవద్దు అంటూ  కోర్టును అభ్యర్థించింది సీబీఐ . అయితే గత రెండు వారాల క్రితమే జగన్ వేసిన పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో... తీర్పును నేటికి వాయిదా వేసింది కోర్టు. దీంతో నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన వ్యక్తిగత హాజరు మినహాయింపుపై వేసిన పిటిషన్ పై సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎటువంటి తీర్పు వెలువడుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: