చిరుధాన్యాలు.. ఇప్పుడు ఆరోగ్యం కోసం అందరూ జపిస్తున్న జపం ఇదే. చిరుధాన్యాలు లేదా మిల్లెట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యం బావుంటుందని కొన్నాళ్లుగా బాగా ప్రచారం జరుగుతోంది. ప్రజల్లోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. ఏపీ సర్కారు కూడా దీన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


చిరుధాన్యాల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. రబీ సీజన్‌లోనే చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు రూపొందించిన ప్రణాళికను సీఎం పరిశీలించారు. చిరుధాన్యాలు సాగు చేసే వారికి నగదు ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆర్గానిక్‌ పంటలను ప్రోత్సహించాలని, ఆర్గానిక్‌ పంటలకు అధిక రేటు ఇచ్చే విధంగా మార్కెటింగ్‌ శాఖకు ఆదేశాలిచ్చారు.


భవిష్యత్తులో పూర్తిగా ఆర్గానిక్‌వైపు వెళ్లాలంటే ఈ ప్రోత్సాహకాలు అవసరం అని ముఖ్యమంత్రి చెప్పారు. అంతే కాదు.. వైయస్‌ఆర్‌ పొలం బడి అనే పేరుతో క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయంలో మెలకువలు, సాగులో కొత్త పద్ధతులు నేర్పించడం కోసం నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామంలో రెండు క్షేత్రాలను ఏర్పాటు చేసి రైతులకు శిక్షణ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.వ్యవసాయ విస్తరణ ఇంకా పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు వ్యవసాయ అధికారులు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పొలాల్లోనే ఉండాలి. రైతులతో కలిసి పనిచేయాలని సూచించారు. సోమవారం స్పందనపై సమీక్ష, సెలవులు మినహాయించి కనీసం వారానికి నాలుగు రోజులు ఫీల్డ్‌లోనే ఉండాలి.


మధ్యాహ్నం 12 గంటల తరువాత నుంచే కార్యాలయాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామస్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల షాపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దానికి సంబంధించిన చర్యలు మొదలుపెట్టారు.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,158 సెంటర్లు రానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: