విశాఖపట్నాన్ని మహానగరం గా తీర్చిదిద్దాలను జగన్ సర్కారు భావిస్తోందట. ఇక జగన్ పాలనలో ఈ నగరం దశ మారిపోబోతందట. ఈ మాటలు చెబుతున్నది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. త్వరలోనే ఉత్తరాంధ్రకు మంచి రోజులు రాబోతున్నాయని, విశాఖ జిల్లాకు మహర్దశ పట్టబోతుందని చెప్పారు. విశాఖ నగరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కలిసి విజయసాయిరెడ్డి మాట్లాడారు.


ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖ నగరాన్ని  అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారని తెలిపారు. ప్రతి ఇంటికీ అభివృద్ధి వైయస్‌ జగన్‌ ధ్యేయమన్నారు. విశాఖకు పరిశ్రమలు తీసుకువస్తామని, జిల్లాకు మహర్దశ పట్టబోతుందని పేర్కొన్నారు. పోలవరం నుంచి విశాఖకు నీరు తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు రాబోతున్నాయని చెప్పారు. ఉద్యోగానికి, సంస్కృతిక రంగానికి విశాఖ కేంద్ర బిందువు కాబోతుందన్నారు.


గతప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున భూ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. అక్రమాలపై విచారణ చేపడుతామని, సిట్‌ సభ్యులను ఇప్పటికే నియమించామని చెప్పారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా నాలుగు మాసాల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. 25 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొనసాగుతారని పేర్కొన్నారు.


ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో చంద్రబాబు ఇష్టారాజ్యంగా దోచుకున్నారని విమర్శించారు. రూ.68 వేల కోట్లు అప్పులు చేశారని తెలిపారు. ఐదేళ్లలో రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారని, అన్ని వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పెద్ద ఎత్తున అప్పులు మిగిల్చారని విమర్శించారు. విశాఖలో పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లు నిర్వహించి, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని నమ్మించారని ధ్వజమెత్తారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: