ఏపీలో ఇసుక దోపిడీ జరిగిందని విమర్శల జోరు పెంచుతున్న ప్రతిపక్షాలకు వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. విశాఖ జిల్లాలో వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు ఇసుక దోచుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, నిరూపిస్తే వారిని సస్పెండ్‌ చేయిస్తా.. చేయలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అవంతి శ్రీనివాస్‌ చంద్రబాబు, పవన్, లోకేష్‌లకు ఓపెన్‌ చాలెంజ్‌ విసిరారు.


తమ ఆరోపణలను నిరూపించలేకపోతే.. చంద్రబాబు, పవన్‌ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు. ఇసుక పోరాటం అని చంద్రబాబు, పవన్‌ ఏదేదో మాట్లాడుతున్నారని, వారి మాటలు వింటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. గత ఐదేళ్లు భీమిలి నియోజకవర్గంలో ఎన్ని లక్షల టన్నుల ఇసుక తొవ్వారో ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు.వైయస్‌ కుటుంబానిది అన్నం పెట్టే చెయ్యి అని మంత్రి అవంతి అన్నారు.


ప్రజాధనం కాపాడాలని సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న ప్రయత్నం చంద్రబాబు నచ్చడం లేదని, అందుకే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. పది సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ బాధ్యతలు తీసుకోగానే.. వరుణదేవుడు కరుణించాడని, కృష్ణానదికి ఏడు సార్లు, గోదావరికి ఐదు సార్లు వరదలు వచ్చాయన్నారు. ఐదు సంవత్సరాల్లో అమలు చేయాల్సిన మేనిఫెస్టోలోని అంశాలను ఐదు నెలల్లో సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తుంటే చంద్రబాబుకు నిద్రపట్టడం లేదన్నారు.


అందుకే సీఎం వైయస్‌ జగన్‌పై చంద్రబాబు, ఆయన తాబేదారులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై, సీఎంపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడాలని సూచించారు. ఐదు నెలల పాలన కూడా కాకముందే ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని, ఈ రాష్ట్రం ఏమైనా నీ జాగీరా చంద్రబాబూ అని ప్రశ్నించారు. గతంలో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశాడన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: