ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే వార్తలు ప్రచురించినా, ప్రచారం చేసినా, సోషల్ మీడియాలో నిరాధార వార్తలు పోస్ట్ చేసినా కేసులు నమోదు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ జీవోపై రాష్ట్రంలో విమర్శలు వస్తున్నాయి. ఇదే జీవోను ఉద్దేశిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ట్వీట్లు చేసారు.

 


రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్య, కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ హిందూ పత్రిక ప్రచురించిన ఓ కార్టూన్ నెట్లో వైరల్ గా మారింది. దీనిని ఉద్దేశిస్తూ.. ‘ప్రభుత్వం మీడియాపై తీసుకొచ్చిన జీవో ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచురించిన ఈ కార్టూన్ సంపాదకులపై ఏమన్నా కేసు పెడతారా’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా.. ‘అమెరికాలో జరిగే టాక్ షోల్లో హసన్ మినాజ్ వంటి అమెరికన్ భారతీయులకు అక్కడి రాజకీయ నాయకులను విమర్శించే, వారిపై జోకులు వేసే హక్కు కూడా ఉంది. కాబట్టి జర్నలిస్టులు ఇకపై ప్రభుత్వాన్ని, నాయకులను పొగుడుతూనే ఉండాలి’ అంటూ ట్విట్టర్ లో ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. పవన్ అభిప్రాయాన్ని జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ముందుకు తీసుకెళ్తున్నారు. అలా అయితే మొదట సాక్షి పత్రికపైనే మొదటగా కేసులు పెట్టాలి అంటూ ‘జనసేన – టీడీపీ’, ‘బాబు – పవన్ చీకటి దోస్తీ’ అంటూ ప్రచురించిన సాక్షి వార్తలను షేర్ చేస్తున్నారు.

 


విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్న ఓ ప్రెస్ మీట్లో.. ‘బాబు – పవన్’ మైత్రి గురించి మీరు సాక్ష్యాలతో నిరూపించగలరా అనే ప్రశ్నకు.. ‘సాక్ష్యాలు లేకపోవచ్చు.. మనస్సాక్షి ఉంది’ అంటూ ఆయన అస్పష్టమైన సమాధానం ఇచ్చిన వీడియోను కూడా ఇందుకు ఉదాహరణగా చూపిస్తూ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: