తెలంగాణ రాష్ట్రంలో సకలజనుల సమర భేరిలో బుధవారం రోజు గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియలపై హైటెన్షన్ నెలకొంది. ప్రభుత్వం కార్మికుల సమస్యలపై చర్చలు జరిపే వరకు బాబు అంత్యక్రియలు జరిపేది లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. జేఏసీ నేతలు బాబు మరణమే చివరి మరణం కావాలని సీఎం కేసీఆర్ చర్చలు వెంటనే జరపాలని డిమాండ్ చేశారు. 
 
ఈరోజు ఛలో కరీంనగర్ తో పాటు బంద్ కు జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బంద్ కు మద్దతు ప్రకటించింది. కాలేజీలు, స్కూళ్లు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని 10 డిపోల కార్మికులు నిరసన శిబిరానికి రావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతుంది. 
 
బాబు మృతదేహానికి అంత్యక్రియలు జరపకుండా బాబు ఇంటిదగ్గరే మృతదేహాన్ని ఉంచి జేఏసీ నేతలు ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మృతదేహం దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నేతలు రాజిరెడ్డి, థామస్ రెడ్డి, కరీంనగర్ జిల్లా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇతర పార్టీల ముఖ్య నేతలు కూడా ఈరోజు నిరసన శిబిరానికి చేరుకోబోతున్నారని తెలుస్తోంది. 
 
బాబు కుటుంబ సభ్యులు జేఏసీ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపే వరకు అంత్యక్రియలు చేయబోమంటూ పట్టుబడుతున్నారు. ప్రభుత్వం బాబు ఇంటిచుట్టూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించింది. ఆర్టీసీ డ్రైవర్ బాబు భార్య మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని చెబుతోంది. డ్రైవర్ బాబు కూతురు మాట్లాడుతూ మా నాన్నకు ఆత్మశాంతి చేకూరాలంటే మిగిలిన ఆర్టీసీ కార్మికులకైనా న్యాయం జరగాలని అన్నారు. బాబు చిన్న కూతురు మాట్లాడుతూ మా ఇంటి పెద్దను కోల్పోయామని ఇంటికి ఆధారం తండ్రి మాత్రమేనని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని చెప్పారు. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: