`` ఆర్టీసీలో తరచూ సమ్మెలు చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగడంతోపాటు, ఆర్టీసీ కూడా నష్టాల పాలవుతోంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సిందే.`` ఇది తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌దేప‌దే చెప్తున్న మాట‌. ఈ నేప‌థ్యంలో.... శనివారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏం నిర్ణయం వెలువడనుంది?.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ చ‌ర్చ జోరుగా సాగుతోంది. గత 27 రోజులుగా జరుగుతున్న సమ్మె ఫలితంగా `అసౌకర్యం` కలుగుతోంని, ఇలాంటి తరచూ తలెత్తే అవ‌కాశాలున్నాయ‌ని ప్రభుత్వం భావిస్తున్నందున‌... క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ అంశంపై కచ్చితంగా విస్తృతస్థాయిలోనే చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, ఆర్టీసీ సమస్యను కార్మిక సంఘాలు న్యాయస్థానాలకు తీసుకువెళ్ళారని న్యాయస్థానాల్లో కేసులు, వ్యాజ్యాలు ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రైవేట్‌ పర్మిట్లకే మొగ్గు చూపాలని భావించినట్టు తెలుస్తోంది. కార్మికులు సమ్మెకు దిగడంతో పాటు బస్సులు ఆశించిన స్థాయిలో తిరక్కపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ప్రభుత్వంగా ఈ సమస్య కు పరిష్కారం చూపవలసిన బాధ్యత తమపై ఉందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. శాశ్వత ప్రతిపాది కన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని అందులో భాగంగా సవరించిన కేంద్ర ప్రభుత్వ మోటారు వాహన చట్టం ప్రకారం రాష్ట్రంలో ప్రైవేట్‌ పర్మిట్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రైవేట్‌ పర్మిట్లకు అవకాశం ఇవ్వనున్న‌ట్లు స‌మాచారం.


తెలంగాణ స‌ర్కారు ఈ నిర్ణ‌యంలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వ చ‌ట్టాన్ని ఉప‌యోగించుకోనున్న‌ట్లు తెలుస్తోంది. లోక్‌సభలో ఇటీవల చేసిన మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019 సెక్షన్‌ 67 ప్రకారం ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు, పోటీతత్వం పెంచేందుకు ప్రైవేట్‌ వాహనాలకు పర్మిట్లు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టంచేసింది. ఈ చట్టం 2019 సెప్టెంబర్‌ 1వ తేదీనుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్టీసీ విషయంలో కేంద్రం పూర్తి అధికారాలను కట్టబెెట్టింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని `ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు` అని పేర్కొంటూ...మూడు నుంచి నాలుగువేల రూట్లలో ప్రైవేట్‌ వాహనాలను నడిపించేందుకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇలా ప్రైవేట్‌ వాహనాలకు పర్మిట్లను జారీ చేయడంవల్ల ఆపరేటర్లు ఆదాయం కోసం తమకు కేటాయించిన మార్గాల్లో బస్సులను నడుపుతారని తద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేట్‌ పర్మిట్లకు అవకాశం ఇవ్వడంవల్ల పోటీతత్వం పెరుగుతుందని షిఫ్టుల గోడవ లేకుండా ప్రజా రవాణాకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంచుతారని తద్వారా ప్రజలకు ఇప్పటికంటే మరింత ఎక్కువగా రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల రోడ్డు రవాణాలో `ఆరోగ్యకరమైన పోటీ`ని తీసుకువచ్చి పార్లమెంట్‌ ఆమోదించిన చట్టం ఉద్దేశాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసినట్టవుతుందని త‌ద్వారా...త‌మ  ఆకాంక్ష‌ను కేంద్రం  చ‌ట్టం రూపంలో నెర‌వేర్చుకోవ‌చ్చున‌ని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: