దేశంలోనే తొలిసారిగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఒకచోట చేర్చి కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేసే హరిత పారిశ్రామిక పార్కుకు యాదాద్రి జిల్లా  చౌటుప్పల్‌ మండలం, దండుమల్కాపురంలో అంకురార్పణ జరగనుంది. దీన్ని దేశంలోనే ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల ‘మోడల్‌ పార్కు’గా తయారు చేయడానికి ప్రణాళిక వేశారు. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ఈ పార్కు కోసం 1246 ఎకరాల భూమి సేకరణ. మరో 700 ఎకరాలు సమకూర్చనున్నారు. శుక్రవారం ఈ పార్కుకు  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడే రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు.


 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం 450 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్‌)కు కేటాయించారు. ఇందులో 20శాతం భూమిని హరితహారానికి ప్రత్యేకంగా కేటాయించారు. రెండేళ్ల వ్యవధిలో రూ.1500 కోట్ల పెట్టుబడితో 450 పరిశ్రమలు ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది. సకాలంలో పరిశ్రమలను స్థాపించని పక్షంలో  అందుకు కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలని నిర్ణయంలో సర్కారు ఉంది. ఈ పార్కులోనే ‘నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని’ సమకూర్చనున్నారు. ఆయా కేంద్ర ద్వారా స్థానిక యువతకు పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా శిక్షణ ఇవ్వనున్నారు.



అంతేకాకుండా పార్కు కోసం భూమిని ఇచ్చిన రైతు కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పిస్తారు.ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా, మరో ఇరవై వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. పార్కుకు అనుబంధంగా యాజమాన్యాలు, కార్మికులు నివాసముండేందుకు 200ఎకరాల్లో ‘టౌన్‌షిప్‌’ నిర్మించే ప్రణాళిక ఖనిజ వనరులు అపారం. హరిత పారిశ్రామిక పార్కుకు ఆనుకుని 2003లో శంకుస్థాపన జరిగిన టెక్స్‌టైల్‌ పార్కులో ఇప్పటికీ వస్త్ర సంబంధ పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. మంత్రి దీనిని కూడా గాడిన పెడతారని కార్మికులు ఆశతో ఉన్నారు. ఇతర పార్కుల మాదిరిగా కాకుండా హరిత పరిశ్రమల పార్కులో పరిశ్రమలన్నీ ప్రారంభించి ఆదర్శంగా తీర్చిదిద్దుతారని, స్థానికులకు ఉపాధి కల్పిస్తారని స్థానిక యువత ఆశిస్తోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: