తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ మహమ్మారి ప్రజల ఆరోగ్యాన్ని హరించేస్తోంది. ఎంతోమంది డెంగ్యూ జ్వరాలతో బాధ పడుతూండగా కొంతమంది మృత్యువాత పడ్డారు కూడా. ఇటివలే మంచిర్యాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ డెంగ్యూ జ్వరం బారిన పడి ప్రాణాలో కోల్పోవటం తీవ్ర సంచలనం రేపింది. ఈ సంఘటనతో డెంగ్యూ ఎంతలా విజృంభిస్తుందో, ప్రజల ఆరోగ్యాలు ఎంత దెబ్బతింటున్నయో తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు డెంగ్యూ బారి నుంచి ప్రజలను కాపాడలేకపోతున్నాయి.

 

 

ఈ సంఘటన జరిగిన అనంతరం పారిశుద్ధ్యం విషయంలో అధికారులు దోమల నివారణ చర్యలకు ఉపక్రమించారు. పట్టణవ్యాప్తంగా పారిశుద్ధ్యం లోపించిందనే అంటున్నారు. డెంగ్యూ బాధితులకు ఇక్కడ మందులు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెంగ్యూ ప్రబలుతోందని తెలిసిన వెంటనే పారిశుధ్ద్య చర్యలు తీసుకుంటే బాగుండేదని ప్రజలు అంటున్నారు. నలుగురి ప్రాణాలు పోతేనే కానీ ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబంలోని గర్భిణీ సోనా బిడ్డకు జన్మనిచ్చిన మరునాడే డెంగ్యూతో చనిపోవడం తీవ్రంగా కలచివేస్తోంది. ప్రభుత్వం నామమాత్రపు చర్యలు తీసుకోవటం వల్లే డెంగీ ప్రబలిందని అంటున్నారు. ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నా సరైన సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు.

 

 

మరోపక్క వైద్యాధికారులు ఇది డెంగ్యూ కాదు అని చెప్పడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా ఆరోగ్య, మున్సిపల్ శాఖల నిర్లక్ష్యమేనని అంటున్నారు. ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ పంజా విసురుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 25 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. పారిశుద్ధ్య చర్యలు తీసుకోవటంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయలేదనే వాదన వినిపిస్తోంది. రాజధాని హైదరాబాద్ లో కూడ డెంగ్యూ జ్వర పీడతులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: