తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె రోజు రోజుకు తీవ్ర‌రూపం దాల్చుతోంది. ఈ సమయంలో అక్కడక్కడ సంభవించే కార్మికుల మరణాలు కూడా సమ్మెకు మరింతగా ఆజ్యం పోస్తున్నాయి. ఇకపోతే క‌రీంన‌గ‌ర్‌లో డ్రైవర్ బాబు మ‌ర‌ణంతో ఉద్య‌మం తారాస్థాయికి చేరిన ఆన‌వాళ్లు క‌నిపిస్తున్నాయి. ఇది నిజంగానే స‌మ‌ర శంఖారావ‌మంటున్నారు కార్మికులు.


మ‌రోవైపు ప్ర‌జ‌ల నుంచి కూడా క్ర‌మంగా వ్య‌తిరేక‌త పెల్లుబుకుతోంది. రాబోయే స్థానిక ఎన్నిక‌ల్లో గెలిచితీరాల‌ని భావిస్తున్న టీఆర్ఎస్‌కు ఇది ఇబ్బంది క‌లిగిస్తుంద‌నే ఆందోళ‌న లేక‌పోలేదు. అయినా కేసీఆర్ లో ఎటువంటి చ‌ల‌నం లేదు. పైగా ప్ర‌యివేటు బ‌స్సుల‌కు సంత‌కం చేశారు. రేపో..మాపో 3000 ప్ర‌యివేటు బ‌స్సులు రోడ్ల‌పైకి తిరుగుతాయంటున్నారు.


ఇక ఉద్య‌మం మొద‌లై 28 రోజులు కావస్తున్న నేపధ్యంలో ఇప్పటివరకు క‌నీసం 10 మంది ఆర్టీసీ కార్మికులు మ‌ర‌ణించారు. ఇద్ద‌రు బ‌లిదానం చేసుకున్నారు. ఇక ఇప్పటివరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే తన పంతం నెగ్గించుకునేందుకు కేసీఆర్ ఎంత‌వ‌ర‌కైనా వెళ్లేందుకు వెనుకాడ‌ర‌నేది కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్న చేదునిజమని ఆరోపణలు వస్తున్నాయి.


ఇకపోతే ఆర్టీసీ కార్మికుల సమ్మె పిటీషన్ పై నేడు హైకోర్టు లో మరోసారి విచారణ జరగనున్నది. ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వం మధ్య చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.  హైకోర్టు ఆదేశం మేరకు శనివారం నాడు ఆర్టీసీ ఉన్నతాధికారులతో, ఆర్టీసీ జేఏసీ మధ్య మొక్కుబడిగా చర్చలు జరిగాయి. ఇకపోతే జేఏసీ నాయకులు తమను నిర్బంధించి బలవంతంగా చర్చలు జరిపిందని  ఆరోపించగా,


అధికారులు మాత్రం సమావేశంలో పాల్గొన్న జేఏసీ నాయకులు తమ అభిప్రాయాన్ని తరువాత చెబుతామని వెళ్లిపోయారని  పేర్కొన్నారు. ఇక జేఏసీ నాయకులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ మొబైల్ ఫోన్లను లాక్కుని ఒక గదిలో బంధించి చర్చలు జరిపారని ఆరోపించారు. ఈ చర్చలపై హైకోర్టు కు ప్రభుత్వం తరఫున న్యాయవాది, ఆర్టీసీ జేఏసీ తరఫున న్యాయవాది ఇవ్వాళ పూర్తివివరాలు అందచేయనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: