పత్రికా స్వేచ్ఛపై ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రచ్చ జరుగుతోంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో.. మీడియా స్వేచ్ఛను హరించేలా ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే తామెప్పుడూ మీడియా స్వేచ్ఛను గౌరవిస్తామని వైసీపీ కౌంటరిస్తోంది. 


మంత్రి పేర్ని నాని పత్రికాస్వేచ్ఛపై మీడియా ముందుకొచ్చారు. మీడియాకు సంకెళ్లు అంటూ టీడీపీ తప్పు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పత్రికలను నియంత్రించే చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవని పేర్కొన్నారు. ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని స్పష్టత ఇచ్చారు. ఆధారాలతో విలేకరులు రాస్తే తాము కూడా స్వాగతిస్తామన్నారు. ఊహాగానాలు మంచిది కాదని హితవు పలికారు. నిజాలు రాస్తే కేసులకు భయపడే ప్రసక్తే ఉండదని పేర్నినాని చెప్పుకొచ్చారు. విలేకర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఇక్కడ మీడియా సంస్థలన్నీ రాజకీయ పార్టీలకు చెందినవేనని చివరిగా కౌంటర్ వేశారు. 


పత్రికా స్వేచ్ఛను హరించే జీవో 2430ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ 2007లో జీవో నెంబర్ 938తో మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. అయితే అప్పుడు ప్రతిపక్షాల అందోళనతో దిగివచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ మీడియాకు సంకెళ్లు వేయటం చేయడం మంచిది కాదని హితవు పలికారు. విపక్షాలు వ్యతిరేకిస్తే వై.ఎస్.ఆర్ 938 జీవోను తక్షణమే రద్దు చేసిన విషయం జగన్ గుర్తించాలన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.


ప్రజాస్వామ్య విలువల్ని అంతకంతకూ జగన్‌ దిగజారుస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ తెచ్చిన జీవోనే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. జీవో నెంబర్‌ 938 కాపీలను బెజవాడలో తగలబెట్టిన నేతలు...  వెంటనే దీనిని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. 


వైసీపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను గౌరవిస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి. జీవో ఎప్పటినుంచో ఉందని.. కొత్తగా పెట్టింది ఏమీకాదన్నారు శ్రీధర్‌రెడ్డి. కొన్ని పత్రికలు, ఛానెల్స్ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, తప్పుడు వార్తలు రాసేవారే దీనికి భయపడాలని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాసినా, వార్తలు ప్రసారం చేసినా.. సదరు సంస్థలు, వ్యక్తులపై కోర్టుకు వెళ్లే అధికారం కార్యదర్శులకు ఇస్తూ జీవో ఇచ్చింది ఏపీ సర్కారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: