ఆంధ్రప్రదేశ్ రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కమిటీ తన పనిని ప్రారంభించింది. అభివృద్ధి కోసం వేసిన కమిటీ అని ప్రభుత్వం పైకి చెబుతున్నా.. రాజధానిపై క్లారిటీ కోసమే ఈ కమిటీ పనిచేయబోతుందనే చెప్పాలి. వేగంగా నివేదిక తయారు చేస్తున్న ఈ కమిటీ.. డిసెంబరులోగా దానిని సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


రాజధాని ఎక్కడ ఉండాలి..? ఎలా ఉండాలి..? అనే అంశాలతో పాటు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ తన పనిని మొదలు పెట్టింది. రాజధాని సహా వివిధ ప్రాంతాల అభివృద్ధి.. అక్కడి పరిస్థితులు.. ఆయా ప్రాంతాలు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు.. వంటి అంశాలపై వివిధ వర్గాల నుంచి సలహాలను ఆహ్వానించింది నిపుణుల కమిటీ. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నాయకులు, ప్రజలు.. ప్రత్యేక విషయాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. మిగిలిన ప్రాంతాల కంటే రాజధానిపై ఎక్కువ సూచనలు, సలహాలు ఈ కమిటీకి వచ్చాయి. రాజధాని ప్రాంత రైతులు ఇప్పటికే తమ అభిప్రాయాలను కమిటీకి చెప్పగా.. అందులో రాజధానిని కొనసాగించాలనే వినతులే ఎక్కువ వస్తున్నాయి. ప్రస్తుత రాజధాని ప్రాంతం మంగళగిరిలో ఎక్కువ అభివృద్ధి చేస్తే బాగుంటుందని, ఎవరి భూములు తీసుకోకుండా ప్రభుత్వ భూమినే వినియోగించవచ్చంటున్నారు ఆ ప్రాంత ఎమ్మెల్యే ఆర్కే.


కేవలం రాజధాని మాత్రమే కాక, ఏఏ ప్రాంతాల్లో అభివృద్ధి చేయవచ్చో.. దానికి అనుకూల పరిస్థితులు ఏంటో వివరిస్తూ కమిటీకి పలు సూచనలు వస్తున్నాయి. రాజధాని విషయం అటుంచితే.. హైకోర్టు ఎక్కడ ఉండాలి..? మార్చాల్సిన అవసరం ఏంటి..? అనే అంశాలపై కూడా నిపుణుల కమిటీ నివేదిక తయారు చేస్తుంది. గతంలో మంత్రి బొత్స చేసిన ప్రకటన నిజమైతే.. హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంపై కూడా చర్చ నడుస్తోంది. అయితే హైకోర్టుకు సంబంధించిన డిమాండ్ లు ఇప్పటి వరకు కమిటీ దృష్టికి రాలేదని సమాచారం.


మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సమాచారాన్ని తెప్పించుకుంటోంది జీఎన్‌ రావు కమిటీ. దాని కోసం ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడంతో.. కేవలం సమాచార సేకరణ మాత్రమే కాక, వారితో సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో.. త్వరలోనే వివిధ కీలక శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కమిటీ సభ్యులు భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 


మొత్తం మీద.. ప్రభుత్వ ఆదేశాలతో పని ప్రారంభించిన జీఎన్ రావు కమిటీ.. క్షేత్ర స్థాయిలో పర్యటనలు మాత్రం మొదలు పెట్టలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్దం చేసుకోనుంది. 13 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి.. ఆ జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత డిసెంబర్‌ నెలలో కమిటీ తన నివేదిక ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: