ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ నెల నుండి నూతన మద్యం పాలసీ అమల్లోకి రావటంతో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంతో పోలిస్తే మద్యం రేట్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజునుండి నూతన మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం రేట్లు పెరగబోతున్నాయని తెలుస్తోంది. 
 
గతంతో పోలిస్తే 15 నుండి 20 శాతం వరకు రేట్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నూతన మద్యం పాలసీకి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం వ్యాపారుల నుండి భారీగా టెండర్లు వచ్చాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తూ ఉండటంతో ఏపీ మద్యం వ్యాపారులంతా తెలంగాణలో మద్యం దుకాణాలను దక్కించుకోవటానికి పోటీ చేశారు. 
 
గతంతో పోలిస్తే అబ్కారీ శాఖ లైసెన్స్ ఫీజును భారీగా పెంచినప్పటికీ రెండు రాష్ట్రాల వ్యాపారులు జోరుగా టెండర్లు దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కేవలం ధరఖాస్తుల ద్వారా 975 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో 2,216 దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా దుకాణాదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. లైసెన్స్ ఫీజులను జనాభా ప్రాతిపదిక ఆధారంగా ఖరారు చేయటం జరిగింది. 
 
ప్రభుత్వం మద్యం అమ్మకాలకు జీ.హెచ్.ఎం.సీ పరిధిలోని ప్రాంతాలలో మాత్రం ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మిగతా ప్రాంతాలలో మాత్రం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు  అనుమతి ఇచ్చింది. 5,000లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు 50 లక్షల రూపాయలు  లైసెన్స్ ఫీజు కాగా 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలకు కోటి పది లక్షల రూపాయలను లైసెన్స్ ఫీజుగా ఆధికారులు నిర్ణయించారు. నూతన మద్యం పాలసీ 2021 సంవత్సరం అక్టోబర్ 31 వరకు అమల్లో ఉండనుంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: