సాధారణంగా ఓ దొంగతనం జరిగితే పోలీస్ కేసు నమోదు అయితే.. ఇన్వెస్టిగేషన్ లో సుపీరియర్స్ తో పాటు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ ఉండటం చూస్తుంటాం.  కానీ ఒక దొంగను పట్టుకునేందుకు దాదాపుగా వెయ్యి మంది రంగలోకి దిగారు.. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మరి అదేమైనా కోట్ల సంపద దోచుకు పోయిన వ్యక్తికి సంబంధించిందా అంటే అది కూడా కాదు. 

ఓ ప్రబుద్దుడు వృద్దాప్య పెన్షన్ కోసం తీసుకు వస్తున్న డబ్బును దొంగిలించడంతో కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు చేసిన దర్యాప్తు.  వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలంలో రామలక్ష్మమ్మ అనే మహిళ వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసేందుకు బ్యాంకు నుండి 16 లక్షల రూపాయలను డ్రా చేసింది.  వాటిని జాగ్రత్తగా తీసుకొని ఆటోలో వెళ్తుంది. అయితే ఆటోని ఆపి కుళ్లాయప్ప అనే దొంగ ఆమెను బెదిరించి రామలక్ష్మమ్మ దగ్గర ఉన్న బ్యాగ్ ను లాక్కొని వెళ్ళాడు. 

హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి షాక్ కి గురైన రామలక్ష్మమ్మ తర్వాత తేరుకొని పోలీసులకి సమాచారం ఇవ్వగా వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.  అయితే దొంగ డబ్బు తీసుకొని ఎంతో దూరం వెళ్లి ఉండడని భావించిన పోలీసులు చాలా చాకచౌక్యంతో పక్కన ఉన్న గ్రామాల వారిని అప్రమత్తం చేశారు. దీనితో దాదాపుగా వేయి మంది రంగంలోకి దిగి కొన్ని గంటలలోనే దొంగను పట్టుకున్నారు.

అతని నుంచి రామలక్ష్మమ్మ డ్రా చేసిన పదహారు లక్షలు డబ్బును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. ఆ డబ్బు రెండు గ్రామాలకు సంబంధించిన వృధ్యాప్య ఫించన్ గా తెలిసింది.  ఏది ఏమైనా వృద్దులకు చెందాల్సిన డబ్బు ఓ దొంగకు చెందకుండా తమదైన వ్యూహంతో పోలీసులు చేసిన పనికి అక్కడి ప్రజలు మెచ్చుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: