ఒకే ఒక్కడు సినిమా చూసి ప్రేరణ పొందాడో ఏమోగానీ.. తనను ముఖ్యమంత్రిని చేయాలని మహారాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశాడో రైతు. బీజేపీ, శివసేన మధ్య కుర్చీ వివాదం కొలిక్కి వచ్చే వరకూ తనను సీఎంను చేయాలనేది సదరు అన్నదాత విన్నపం. ఇంతకీ ఎందుకు ముఖ్యమంత్రిని చేయాలని ఆ రైతు గవర్నర్‌ను కోరాడు?   


నన్ను మహారాష్ట్ర సీఎంను చేయండి. ఇదీ మహారాష్ట్ర రైతు ఆ రాష్ట్ర గవర్నర్‌కు పెట్టుకున్న అర్జీ.  బీజేపీ, శివసేన మధ్య  ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో వెలుగు చూసిన లేఖ అన్ని వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. బీదర్‌ జిల్లా కేజ్‌ తాలూకా వాద్మౌలీ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్‌ విష్ణు గడాలే ఈ లేఖ రాశాడు. జిల్లా కలెక్టర్‌కు ఈ లేఖ అంద జేస్తూనే దాని ప్రతిని గవర్నర్‌కు పంపాడు ఆ అన్నదాత. 


బీజేపీ, శివసేన మధ్య వివాదం సద్దుమణిగే వరకూ తనను ముఖ్యమంత్రిని చేయాలన్నది గడాలే లేఖలోని సారాంశం. ఆ రెండు పార్టీల గొడవ ఇప్పట్లో తేలేలా లేదు. అంత వరకూ తనను సీఎంను చేయండి. బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను.  ప్రకృతి వైపరీత్యాల వల్ల రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నాయి.  రైతుల గగ్గోలు పెడుతున్నారు. అన్నదాతల గోడు పార్టీలేవీ పట్టించుకోవడం లేదు. తనను సీఎంను చేసే రైతుల సమస్యలను పరిష్కరిస్తానని లేఖలో స్పష్టం చేశారు గడాలే.  లేదా గవర్నరే రాజ్యాంగ పరంగా పాలన బాధ్యతలు చేపట్టాలని ఆయన కోరాడు.  


మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇంకా పాలన పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్లకపోవడంతో అక్కడ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవైపు వర్షాలు.. వరదలు.. రైతులు  పడుతున్న ఇబ్బందులు.. ఇలా ఎన్నో సమస్యల్లో రాష్ట్రం కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకునే నాథుడే లేడంటూ అక్కడి ప్రజలు లబోదిబో అంటున్నారు. అక్కడి వారి ఆవేదనను గుర్తించిన ఓ రైతు ఇలా గవర్నర్ కు లేఖ రాశారు. మీరు పట్టించుకుంటారా.. లేక తనను సీఎం పదవిలో కూర్చోబెడతారా అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: