జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు నిరాశే ఎదురైంది. తెలంగాణలో జ‌రుగుతున్న ఆర్టీసీ కార్మికుల స‌మ్మె విష‌యంలో ప‌వ‌న్ ప్ర‌య‌త్నానికి ఆదిలోనే నిరాశ‌భ‌రిత స‌మాధానం వ‌చ్చింది. తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయమై మాట్లాడడానికి సీఎం కె.చంద్రశేఖరరావు త‌ర‌ఫు నుంచి సానుకూల స్పంద‌న రాలేద‌ని జ‌న‌సేన పార్టీ పేర్కొంది. ముఖ్య‌మంత్రే కాకుండా...పార్టీ ముఖ్య నేత‌లైన కె. కేశవరావు, మంత్రి కె.టి. రామారావు, ఇతరులు సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదని జ‌న‌సేన ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.


గురువారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో టీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు పవన్ కళ్యాణ్‌ను క‌లిసి...గత 27 రోజులుగా జరుగుతున్న సమ్మె వివరాలను, తమ డిమాండ్లను వివరించారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందని, సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. జేఏసీ నేతలతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... "నవంబర్ 3వ తేదీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నాం. విశాఖపట్నం వెళ్లే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తాను. ఆయన్ని కలసి కార్మికుల సమస్యలు వివరిస్తాను. వారి 24 డిమాండ్లు కేసీఆర్ దృష్టిలో పెడతాను`` అని హామీ ఇచ్చారు. 


అయితే, త‌మ ప్ర‌య‌త్నం ఫ‌లితం ఇవ్వ‌లేక‌పోయింద‌ని...తాజాగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు. ``గురువారం నాడు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి నన్ను కలిశారు. సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో ప్రారంభించిన చర్చలు పీటముడిగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 రోజులుగా సమ్మెలో ఉన్నా ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన కనబడటం లేదని బాధను వ్యక్తం చేశారు. సమ్మె సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, కేశవరావు, కొందరు మంత్రులను నేను కలవడానికి సమయం కోసం జనసేన పార్టీ ప్రతినిధులు ప్రయత్నం చేశారు. అయితే దీనిపై మాట్లాడటానికి వారు ఎవరూ ఎందుకోగాని సంసిద్ధంగా లేరు. అందువల్ల వారిని కలవలేకపోయాను`` అని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.


``3వ తేదీన విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహణలో భాగంగా నేను ఆ కార్యక్రమానికి వెళ్లవలసి రావడంతో కేసీఆర్‌ను కలిసే ప్రయత్నాన్ని విశాఖ నుంచి వచ్చిన తర్వాత మరోసారి చేస్తాను. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉంటాను.`` అని పవ‌న్ ప్ర‌క‌టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: